సమకాలీన క్రీడాలోకంలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కింగ్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు. విరట్ కు ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్నగాక మెున్న ఓ పాక్ దేశస్తుడు విరాట్ తమ దేశానికి ఆడితే చూడాలని ఉంది అంటూ.. ప్లకార్డును పట్టుకుని తన అభిమానాన్ని చాటాడు. మరో అభిమాని ఓ ఫొటో కోసం రాత్రంత అతడికోసం పడిగాపులు కాసి చివరికి తన అభిమాన హీరోతో పిక్ దిగిన సంఘటనలనూ చూశాం. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే.. కింగ్ విరాట్ కోహ్లీ సంతకం పెట్టిన బ్యాట్ ను ఆస్ట్రేలియా ఉప ప్రధాని అయిన రిచర్డ్ మార్లెస్ కు అందించారు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సుబ్రహ్మణ్యం జైశంకర్.. విదేశీ వ్యవహారాల మంత్రిగా తనదైన ముద్రవేస్తూ.. దూసుకెళ్తున్నారు. తాజాగా విదేశీ వ్యవహారాల్లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్.. ఆసిస్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి అయిన రిచర్డ్ మార్లేస్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అత్యంత ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయం ఏమైనా ఉందంటే? అది టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ బ్యాట్ అనే చెప్పాలి. అవును కింగ్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను జైశంకర్.. ఆసిస్ ఉప ప్రధానికి బహుమతిగా అందించారు. దాన్ని ఆయన నవ్వుతూ.. స్వీకరించారు. అయితే ఇరుదేశాల ప్రధానులు, ఇతర ఉన్నత నాయకులు భేటీ అయినప్పుడు సాధారణంగా దేవుడి విగ్రహాలు బహుమతిగా ఇవ్వడం సహజం. కానీ ఇక్కడ అలా జరగలేదు.. కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన MRF బ్యాట్ ను అతనికి అందించడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుండటంతోనే జైశంకర్ ఈ గిఫ్ట్ ను అందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో.. విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కదా కోహ్లీ రేంజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ భేటీలో ప్రధానంగా.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును, రక్షణ, శాంతి భద్రతల గురించి ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ భేటీ అనంతరం భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్.. ఆస్ట్రేలియా ఉప ప్రధానికి టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ను బహుకరించారు. ఎంతో మంది దిగ్గజాలకు కూడా ఇలాంటి గౌరవం దక్కలేదని, ఇది అతడి ఆటకు ఇచ్చిన గౌరవంగా మేం భావిస్తున్నాం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Virat Kohli – the face of Indian Cricket ❤️#CricTracker #ViratKohli #T20WorldCup2022 pic.twitter.com/KtBR3t98Ym
— CricTracker (@Cricketracker) October 10, 2022