‘జేమ్స్ అండర్సన్’ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌లో అత్యంత సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ స్టార్ బౌలర్. టెస్టుల్లో అండర్సన్ ఇప్పటికే 630 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముత్తయ్య మురళీ ధరన్, షేన్ వార్న్ తర్వాత మూడో అత్యధిక వికెట్ టేకర్ అండర్సన్. అంతేకాదు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్‌గా అండర్సన్‌కు రికార్డు ఉంది. క్రికెట్ చరిత్రలో గొప్ప బౌలర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 39 సంవత్సరాల వయస్సులోనూ జేమ్స్ అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వెటరన్‌లను సైతం మంత్ర ముగ్దులను చేస్తున్నాడు.
తన టెస్టు కెరీర్‌ను కొనసాగించేందుకు అండర్సన్ 2015లోనే వన్డే, టీ20 ఫార్మాట్‌లకు రిటైర్మ్ంట్ ప్రకటించాడు. 15 డిసెంబర్, 2002 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్ అరంగేట్రం చేశాడు. మే 22, 2003 జింబాంబ్వేపై టెస్టు అరంగేట్రం చేసిన అండర్సన్ అప్పటి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో మేటి బౌలర్‌గానే రాణించాడు. కుర్రాళ్లు గాయాలతో బాధపడుతూ సిరీస్‌లకు దూరమౌతున్నా.. అండర్సన్ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో తన కెరీర్‌ను ఇప్పటి వరకూ కొనసాగించాడు. వయసు ప్రభావమో, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడో తెలీదుగానీ.. అండర్సన్ తన టెస్టు క్రికెట్ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇంగ్లాండ్ – ఇండియా టెస్టు సిరీస్‌లో అండర్సన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసిన అండర్సన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మిగిలిన రెండు టెస్టుల తర్వాత అండర్సన్ కచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో స్టీవ్ హార్మిసన్ మాటలు ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు డిసెంబర్ 8 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న ‘ది యాషెస్’ సిరీస్ వరకు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. వయసు ప్రభావమో, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడమో.. కారణం ఏదైనా అంతర్జాతీయ క్రికెట్‌లో మరో స్టార్ బౌలర్, వెటరన్ లిస్ట్‌లో చేరుతాడని దాదాపుగా ఖరారు అయిపోయినట్లే అని తెలుస్తోంది.