సాధారణంగా ఏ రంగంలోనైనా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రాజకీయాల కారణంగా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు సైతం ఒక్కోసారి అర్దాంతరంగా కెరీర్ ను ముగించాల్సి వస్తుంది. అలా చాలా మంది దిగ్గజ క్రికెటర్ల కెరీర్లు ముగిసిన సంఘటనలు మనం చరిత్రలో చాలానే చూశాం. అలానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ ను కూడా అర్దాంతరంగా ముంగించాలని చూశారని ఓ స్టార్ మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా సెలక్షన్ కమిటీ విరాట్ కోహ్లీని తప్పించాలని చూసినట్లు తాజాగా చేతన్ శర్మ కమిటీపై విమర్శలు గుప్పించాడు. ఈ సెలక్షన్ కమిటీ టీమిండియా నుంచి కోహ్లీని తప్పించడానికి ప్రయత్నాలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్ ముందు ఫామ్ లేమితో తెగ ఇబ్బంది పడ్డాడు. సెంచరీ చేయడానికి మూడు సంవత్సారాలు పట్టింది ఈ రన్ మెషిన్ కు. అయితే ఈ క్రమంలోనే ఆసియా కప్ లో వైఫల్యం, అంతకు ముందు నుంచే పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడుతున్న కోహ్లీని జట్టు నుంచి తప్పించడానికి తెగ ప్రయత్నాలు జరిగినట్లు పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన ఆరోపణలు చేశాడు. అందులో భాగంగానే కోహ్లీని టీ20 కెప్టెన్సీతో పాటు వన్డే కెప్టెన్సీ నుంచి మాట మాత్రం చెప్పకుండా తొలగించిన విషయం మనందరకి తెలిసిందే అని ఈ సందర్బంగా కనేరియా చెప్పుకొచ్చాడు. అయితే టీ20ల్లో కెప్టెన్సీ నుంచి తప్పించినా గానీ వన్డేలకు కెప్టెన్ గా ఉండటానికి విరాట్ ఉత్సాహాం చూపినప్పటికీ అతడిని తొలగించారు. పైగా వైట్ బాల్, రెడ్ బాల్ కు వేరు వేరు కెప్టెన్ ఎందుకుని అప్పుడు సెలక్షన్ కమిటీ అనుకుందని కనేరియా అన్నాడు.
ఈ క్రమంలోనే కోహ్లీ ఫామ్ లో లేడని కొన్ని కొన్ని సిరీస్ లకు విరాట్ ను తప్పించారని గుర్తు చేశాడు కనేరియా. విరాట్ ను శాశ్వతంగా జట్టు నుంచి దూరం చేయాలని చేతన్ శర్మ సెలక్షన్ కమిటీ భావించినట్లు ఈ పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే వీటన్నింటిని అధిగమించి ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. చేతన్ శర్మ సెలక్షన్ కమిటీ చేసిన మరో తప్పిదం త్వరత్వరగా కెప్టెన్ లను మార్చడం అని మండిపడ్డాడు. అలాగే అర్హులైన ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించడంలో కమిటీ విఫలం అయ్యిందని పేర్కొన్నాడు. ఇప్పటికైన రద్దు చేసిన కమిటీ స్థానంలో బీసీసీఐ అనుభవం ఉన్న దిగ్గజ ఆటగాళ్లను మాత్రమే కమిటీలో కి తీసుకోవాలని డానిష్ కనేరియా బీసీసీఐకు సూచించాడు.