పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం అద్భతమైన ఫామ్ లో ఉంది.. పాక్ ను ఓడించడం కష్టం, వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం పాక్ సొంతం.. ఈ మాటలన్ని ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు వచ్చిన పాకిస్థాన్ జట్టుపై మాజీలు కురిపించిన ప్రశంసలు. కానీ ఈ మాటలు అన్ని ఉట్టి నీటిమీద రాతలు అని తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తెలిసిపోయింది. మూడు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయి సిరీస్ ను 3-0తో ఇంగ్లాండ్ కు అప్పగించింది. పాక్ చరిత్రలో సొంత గడ్డపై ఇలా ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దాంతో పాక్ జట్టుపై దారుణమైన విమర్శలకు దిగారు పాక్ మాజీలు. ఈ క్రమంలోనే బాబర్ ను గుండుసున్నాతో పోల్చాడు పాక్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా. ఇకనైనా అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం ఆపలని అభిమానులకు సూచించాడు.
సాధారణంగా ఏ దేశాన్ని అయినా వారి గడ్డపై ఎదుర్కొవడం పెద్ద సవాలే. పైగా పాక్ కు సొంత గడ్డపై ఘనమైన రికార్డులు ఉన్నాయి. మరి అలాంటి రికార్డులు ఉన్న పాక్ ను 3-0తో చిత్తు చేసింది ఇంగ్లాండ్. బజ్ బాల్ క్రికెట్ తో పాక్ కు చుక్కలు చూపించింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ పై తీవ్రంగా మండిపడ్డాడు పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా. “బాబర్ అజమ్ ను ఇక నైనా టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీతో పోల్చడం ఆపండి. బాబర్ ను విరాట్ తో పోల్చడం సరికాదు. ఇక పాక్ జట్టులో రోహిత్, కోహ్లీతో సరిపోయే ఆటగాళ్లు లేరు. కానీ పాక్ ఆటగాళ్ల మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఇక కెప్టెన్ గా బాబర్ పనికిరాడు.. అతడు సుదీర్ఘ ఫార్మాట్ లో ఆడకపోవడమే మంచిది” అని బాబర్ కు సలహా కూడా ఇచ్చాడు కనేరియా.
ఇక బాబర్ బ్రెండన్ మెక్ కల్లమ్, స్టోక్స్ లాంటి వారిని చూసి ఆట నేర్చుకోవాలని, అవసరమైతే ఈగోను పక్కన పెట్టి కెప్టెన్సీ ఎలా చెయ్యాలో సర్పరాజ్ అహ్మద్ ను చూసి నేర్చుకోవాలని డానిష్ సూచించాడు. ముఖ్యంగా బాబర్ కు టెస్టుల్లో నాయకత్వ లక్షణాలు అసలే లేవని కనేరియా తేల్చిచెప్పాడు. గతంలో పాక్ వేదికగా జరిగిన 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను కూడా ఇంగ్లాండ్ 4-3 తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 3-0తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలోనే బాబర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు డానిష్ కనేరియా. ప్రస్తుతం కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే గత కొన్ని రోజులుగా బాబర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. డానిష్ చేసిన వ్యాఖ్యలు పాక్ బోర్డ్ ను ఆలోచనలో పడేశాయి.