టీమిండియా జట్టులో బౌలర్ షమి ఎప్పుడూ స్పెషల్. చాలా నార్మల్ గా కనిపించే .. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టేస్తాడు. దైపాక్షిక సిరీసులతో పాటు ఐసీసీ టోర్నీల్లో తన మార్క్ బౌలింగ్ తో ఎన్నోసార్లు మ్యాచుల్ని గెలిపించాడు. ఇలా కెరీర్ పరంగా షమిని వంకపెట్టడానికి ఒక్క విషయం కూడా ఉండదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం షమి పలు సమస్యల్ని ఫేస్ చేస్తున్నాడు. అందులో ప్రధానమైనది అతడి భార్య హసీన్ జహాన్ పెట్టి గృహహింస కేసు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ కేసులో తుదితీర్పు ఇప్పుడు వెలువడింది. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక విషయానికొస్తే.. 2013లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన షమి, ఆ తర్వాత ఏడాదే హసీన్ జహాన్ ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. అయితే కొన్నేళ్ల ముందు జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో షమిపై అతడి భార్య హసీన్ గృహ హింస కేసు పెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయమై షమిపై నాన్ బెయిలబుల్, హత్యాయత్నం లాంటి అభియోగాలు నమోదయ్యాయి. సొంతూరు వెళ్లి వచ్చిన ప్రతిసారి కూడా తనని చిత్రహింసలకు గురిచేసేవారని హసీన్ ఆరోపించింది. షమి కుటుంబ సభ్యులు తనతో ఎలా ఉండేవారో.. ఇరుగుపొరుగు ఎవరిని అడిగినా సరే చెబుతారని ఆమె చెప్పుకొచ్చింది. అతడు (షమి) రెండేళ్లుగా తనని విడాకులు అడుగుతున్నాడని, తాను మౌనంగా ఉండటంతో చిత్రహింసలు పెట్టేవాడని ఆరోపణలు చేసింది. ఇంటి నుంచి తనని వెళ్లగొట్టేందుకు అన్ని పనులు చేశారని హసీన్ చెప్పుకొచ్చింది.
తనని పలు ఫోన్ల నంబర్లతో ఫోన్ చేసి బెదిరించేవాడని కూడా హసీన్.. క్రికెటర్ షమిపై ఆరోపణలు చేసింది. అయితే ఈమె మాట్లాడిన ప్రతిసారి కూడా షమి.. వీటిని కొట్టిపారేస్తూ వచ్చాడు. తన పరువు తీసేందుకు ఇలా చేస్తుందని, తను తప్పు చేసినట్లు తేలితో సారీ చెప్పేందుకైనా రెడీ అని షమి చెప్పుకొచ్చాడు. ఇలా ఈ కేసులో చాలా రోజుల నుంచి వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసులో కోల్ కతా కోర్టు తీర్పిచ్చింది. తన మాజీ భార్య హసీన్ జహాన్ కు ప్రతినెల భరణం కింద రూ.50 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై హసీన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే తన వ్యక్తిగత ఖర్చుల కోసం రూ.7 లక్షలు, కుమార్తెని చూసుకునేందుకు రూ.3 లక్షలు.. మొత్తం ప్రతి రూ.10 లక్షలు కావాలని 2018లో హసీన్ కోర్టుని ఆశ్రయించింది. ఇప్పుడు కోర్ట్ మాత్రం నెలకు రూ.50 వేలని మాత్రం తీర్పివ్వడంతో హసీన్.. ఈ కేసు విషయమై హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.