ప్రముఖ మీడియా ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అడ్డంగా దొరికిపోయాడు. గంగూలీ–కోహ్లీ ఇష్యూతో పాటు రోహిత్‌కు కెప్టెన్సీ ఎలా వచ్చిందనే దాని వెనుక ఉన్న సీక్రెట్‌ను చేతన్ రివీల్ చేశాడు. దీంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా వీటికి ఒక్క పోస్ట్‌తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అడ్డంగా బుక్కవ్వడం తెలిసిందే. ఆఫ్ ది రికార్డు పేరుతో భారత జట్టుకు సంబంధించిన సంచలన విషయాలను ఆయన బయటపెట్టాడు. ఇప్పుడు దీనిపై వివాదం రాజుకుంది. టీమిండియాకు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ, రోహిత్–విరాట్ వివాదం, గంగూలీ వర్సెస్ కోహ్లీ లాంటి కాంట్రవర్షియల్ అంశాలను చేతన్ శర్మ వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
గంగూలీ–కోహ్లీ మధ్య ఈగో వార్ నడిచిందని ఈ వీడియోలో చేతన్ శర్మ వెల్లడించాడు. వన్డే సారథ్యం నుంచి గంగూలీ తనను ఉద్దేశపూర్వకంగా తొలగించాడని భావించిన కోహ్లీ.. మీడియా ముందు దాదాను దోషిగా నిలిపేందుకు టీ20 కెప్టెన్‌గా కొనసాగమని తనను ఎవరూ అడగలేదని అబద్ధం చెప్పాడని చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం వెనుక ఉన్న కారణాలను కూడా చేతన్ శర్మ రివీల్ చేశాడు. విరాట్ కోహ్లీ మీద కోపంతోనే రోహిత్‌కు సారథ్య పగ్గాలు అందాయన్నాడు.
రోహిత్‌ను కెప్టెన్ చేయడానికి కోహ్లీ మీద గంగూలీకి ఉన్న కోపమే కారణమన్నాడు. అంతేగానీ.. హిట్‌మ్యాన్ మీద ఉన్న ప్రేమ కాదని బాంబు పేల్చాడు చేతన్ శర్మ. విరాట్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక దాదా ఒక్కడే లేడని.. అతడితో పాటు బోర్డు పెద్దలంతా కలసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని అన్నాడు. రోహిత్ టీ20 కెరీర్ ఇక ముగిసినట్లేనని, పొట్టి ఫార్మాట్లో హార్దిక్ పాండ్యానే పూర్తి స్థాయి సారథిగా ఉంటాడని వెల్లడించాడు. శుబ్‌మన్ గిల్ లాంటి యంగ్ క్రికెటర్స్‌కు చాన్స్ ఇచ్చేందుకే సీనియర్లను పక్కన పెట్టామన్నాడు.
చేతన్ శర్మ వెల్లడించిన ఈ విషయాలు వివాదాస్పదం కావడంతో బీసీసీఐ అలర్ట్ అయింది. దీనిపై విచారణ జరిపి, చేతన్ శర్మ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, చేతన్ శర్మ వ్యాఖ్యలు కాంట్రవర్షియల్‌గా మారిన వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ పెట్టిన ఓ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 17న ఆస్ట్రేలియా–టీమిండియాకు మధ్య రెండో టెస్టు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు హస్తినకు బయల్దేరింది. స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా ఢిల్లీకి పయనమయ్యాడు.
చాన్నాళ్ల తర్వాత ఢిల్లీకి కారులో లాంగ్ డ్రైవ్ చేస్తున్నట్లు ఇన్‌స్టా పోస్ట్ ద్వారా కోహ్లీ తెలిపాడు. ఈ అనుభూతి ఎంతో బాగుందంటూ కామెంట్ చేశాడు. అయితే, కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేసేందుకు గల కారణాలు, రోహిత్ ఎలా కెప్టెన్ అయ్యాడు లాంటి విషయాలను చేతన్ శర్మ వెల్లడించిన నేపథ్యంలో కోహ్లీ తాజా పోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. తనను కెప్టెన్సీ నుంచి తప్పించినా.. బీసీసీఐ పెద్దలు, గంగూలీ తనకు వ్యతిరేకంగా పావులు కదిపినా విరాట్ అన్నీ తట్టుకున్నాడు. తనతో పెట్టుకున్న వాళ్లందరికీ ఇన్‌డైరెక్టుగా తగ్గేదేలే అంటూ విరాట్ ఇన్‌స్టాలో చేసిన పోస్టు కౌంటర్‌గా కనిపిస్తోంది. మరి, విరాట్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.