వసీం అక్రమ్, వకార్ యూనిస్, సౖక్లెన్ ముస్తాఖ్, షాహిద్ అఫ్రీది వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను అరంగేట్ర మ్యాచ్‌లోనే అవలీలగా ఎదుర్కొన్న భారత ఓపెనర్ ప్రస్తుతం సినీ రంగంలో సత్తాచాటుతున్నాడు.
మన దేశంలో క్రీడలను సినిమాలను వేరు చేసి చూడటం కష్టమే. భారత తొలి తరం కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నుంచి మొదలుకొని.. తాజా మాజీ సారథి విరాట్ కోహ్లీ వరకు ఎందరో ప్రముఖ క్రికెటర్లు బాలీవుడ్ భామాలతో జోడీ కట్టారు. అజహరుద్దీన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత పెద్దగా మారుతుంది. అయితే సినిమా రంగానికి చెందిన వారిని పెళ్లాడటమే కాకుండా.. కొందరు ఆటగాళ్లు నటనలోనూ రాణించి అదుర్స్ అనిపించుకున్నారు. సచిన్ టెండూల్కర్‌పైన రూపొందించిన ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్’ కోసం మాస్టర్ బ్లాస్టర్ తన వ్యక్తిగత ఫీడ్ అందివ్వగా.. ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ కోసం మన మహేంద్రసింగ్ ధోనీ ప్రచారకర్త అవతారమెత్తాడు. జులన్ గోస్వామి, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్ వంటి మరెందరో ప్లేయర్ల జీవితాలు తెరకెక్కగా.. శ్రీశాంత్, హర్భజన్ వంటి వారు వెండితెరపైనా తళుక్కుమన్నారు. అయితే.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడిన ఓ భారత ఆటగాడు సినీ రంగంలో సెటిల్ అయిన విషయం మీకు తెలుసా!
వన్డే క్రికెట్‌లో వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన భారత ఓపెనర్ సదగోపన్ రమేశ్ పేరు వినే ఉంటారు కదా. 1999లో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్‌హ్యాండర్.. ప్రస్తుతం సినీ రంగంలో రాణిస్తున్నాడు. టీమ్‌ఇండియా తరఫున 19 టెస్టులు, 24 వన్డేలాడిన రమేశ్ 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకోక ముందు ఓపెనర్‌గా సేవలందించిన రమేశ్.. ఆ తర్వాత ఎక్కువ కాలం జాతీయ జట్టులో కొనసాగలేకపోయాడు. సాధారణంగా భారత క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకుంటే.. ఎక్కువ శాతం మంది కామెంట్రీ వైపు లేకపోతే.. శిక్షణ రంగం వైపు అడుగులు వేస్తారు. కానీ సదగోపన్ రమేశ్ మాత్రం వీరికి భిన్నంగా సినిమా రంగాన్ని ఎంచుకున్నాడు.
కాసులు కురిపించే ఐపీఎల్‌ను కాదనుకున్న రమేశ్.. 2008లో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ యాక్టర్లు జయం రవి, జెనీలియా డిసౌజా, ప్రకాశ్‌రాజ్ వంటి వారితో కలిసి రొమాంటిక్ కామెడీ చిత్రం (సంతోష్ సుబ్రమణ్యం)తో తమిళ వెండి తెరకు పరిచయమైన రమేశ్.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌తో అనుబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. 2011లో క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా (పొట్టా పొట్టి)లో నటించిన రమేశ్.. పలు సినిమాల్లో కీలక పాత్రలతో ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాడు. సినిమా రంగంలోనే కెరీర్ కొనసాగించాలనుకొని నిర్ణయించుకున్న రమేశ్.. ‘కరాకోలో స్వరాస్’ పేరిట 2019లో ఓ స్టూడియో సైతం నిర్మించాడు. మల్టీపర్పస్ స్టూడియో నిర్వహణతో పాటు రియాల్టీ షోలో జడ్జీగా కొనసాగుతున్న రమేశ్ అసలు సిసలు ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు. సూపర్ స్టార్ రజినికాంత్‌కు వీరాభిమాని అయిన రమేశ్.. సినీరంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం!