క్రికెట్ ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అత్యంత ధనిక బోర్డు అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ తమదైనశైలిలో ఎన్నో అద్భుత నిర్ణయాలు తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో బీసీసీఐ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు ఆటగాళ్లకు మాత్రమే ఏ+ గ్రేడ్ ని ఇచ్చేవారు. ఇకనుంచి అంపైర్లకు కూడా ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మాజీ అంతర్జాతీయ అంపైర్లు, బీసీసీఐ అంపైర్ల సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అంపైర్లకు ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు మాత్రమే ఉండేవి. ఇక నుంచి కొత్తగా ఏ+ అనే గ్రేడ్ ను కూడా సృష్టించారు.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మెంబర్ నితిన్ మేనన్ సహా ఇంటర్నేషనల్ అంపైర్లు అయిన.. అనిల్ చౌదరీ, మదన్ గోపాల్ జయరామన్, కెఎన్ అనంతపద్మనాభన్, వీరేంద్ర కుమార్ శర్మలకు ఏ+ గ్రేడ్ కు బీసీసీఐ ప్రమోషన్ కల్పించింది. ఏ+ కేటగిరీలో ఉన్న అంపైర్ల కాంట్రాక్ట్ మొత్తం అనేది బీసీసీఐ రివీల్ చేయలేదు. కానీ, కాంట్రాక్ట్ వ్యాల్యూ పెద్ద మొత్తంలోనే ఉంటుందని సమాచారం.
ఇంక మ్యాచ్ ఫీజు విషయానికి వస్తే.. ఏ+, ఏ కేటగిరీ అంపైర్లకు ఒక్కే మ్యాచ్ కు రూ.40 వేలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఇంక బీ, సీ గ్రేడ్ అంపైర్లకు మ్యాచ్ కు రూ.30 వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏ+ కేటగిరీలో 5 అంపైర్లు, ఏ కేటగిరీలో 20 మంది, బీ గ్రేడ్ లో 60 మంది, సీ కేటగిరీలో 46 అంపైర్లు ఉన్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓ అధికారి స్వయంగా స్పష్టం చేశారు కూడా. అంపైర్ల కోసం ఏ+ కేటగిరీ సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.