ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడు. రాజకీయాలతో బిజీ అవుతాడనుకుంటే.. సీఎస్కే కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టాడు.
టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించాడు రాయుడు. భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా జట్టుతో 2019, మార్చి 8న జరిగిన వన్డేనే రాయుడి కెరీర్లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్. ఆ తర్వాత అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతూ వచ్చాడు. చెన్నై జట్టు ఈ ఏడాది ఐపీఎల్ కప్ గెలవడంలోనూ తనదైన పాత్ర పోషించాడు రాయుడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో క్రీజులో ఉన్నంత సేపు మంచి షాట్లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడీ తెలుగు క్రికెటర్. ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత రాయుడు రాజకీయాలతో బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు.
అంబటి రాయుడు వైసీపీలో చేరతాడని జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో ఏపీ సీఎం జగన్‌తో ఒకసారి భేటీ అయిన రాయుడు.. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో వైసీపీలో రాయుడు చేరడం పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే పాలిటిక్స్‌తో పూర్తిగా బిజీ అవుతాడనుకుంటే రాయుడు మళ్లీ బ్యాట్ పడుతున్నాడు. అమెరికా దేశంలో జులై నెలలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్లో రాయుడు ఆడనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ టీమ్ తరఫున రాయుడు గ్రౌండ్లోకి దిగనున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు అర్హత సాధించాడు. మేజర్ లీగ్‌లో అతడు ఆడటంలో తప్పులేదు. కానీ రాజకీయాలతో బిజీ అవుతాడని అందరూ అనుకున్న తరుణంలో అనూహ్యంగా మనసు మార్చుకొని మళ్లీ బ్యాట్ పట్టడం షాకింగ్ న్యూస్ అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.
Ambati Rayudu will be playing for Texas Super Kings. pic.twitter.com/gtzCbdUGKb
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 15, 2023