ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న రోహిత్ సేన ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు.
సుదీర్ఘ ఫార్మాట్ లో నిలకడగా విజయాలు సాధిస్తూ.. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సర్కిల్స్ లోనూ ఫైనల్ కు చేరిన భారత్.. ఈ సారి కూడా జోరు కనబర్చాలనుకుంటే.. రోహిత్ సేన ఆశలపై వర్షం నిళ్లు చల్లింది. 2019-21, 2021-23 సర్కిల్స్ లో తుదిపోరుకు చేరి రన్నరప్ తో సరిపెట్టుకున్న టీమిండియా.. 2023-25 సర్కిల్ లో ఘణంగా బోణీ కొట్టేందుకు సిద్ధమైన వేళ.. అనుకోని వర్షం ముంచెత్తింది. దీంతో వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారీ విజయాన్నందుకున్న రోహిత్ సేన.. రెండో పోరులోనూ గెలుపు గీతకు సమీపించిన సమయంలో వరుణుడు ప్రతాపం చూపాడు. రెండో ఇన్నింగ్స్ లో ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ గ్యాంగ్ విజయావకాశాలు కల్పించుకోగా.. చివరి రోజు ఆటలో ఒక్క బంతి కూడా సాధ్య పడలేదు. దీంతో మ్యాచ్ ‘డ్రా’ గా ముగిసింది. రోహిత్ సేన 1-0తో సిరీస్ కైవసం చేసుకోవడం ఆనందకరమైన విషయమే అయినా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మాత్రం భారత్.. తన స్థానాన్ని చేజార్చుకుంది.
తాజా సర్కిల్ లో ఇప్పటి వరకు 2 మ్యాచ్ లు ఆడిన భారత్.. ఒక విజయం, 1 డ్రాతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ నెగ్గిన పాకిస్థాన్ పట్టిక టాప్ కు చేరింది. చాంపియన్ షిప్ ర్యాంకింగ్ పాయింట్లలో దాయాది జట్టు 100 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే.. భారత్.. 66.67 పాయింట్లతో రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. మరో టెస్టు మిగిలుండగానే ఇంగ్లండ్ పై యాషెస్ సిరీస్ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా 54.17 పాయింట్లతో మూడో ప్లేస్ లో ఉంది.
శ్రీలంకతో రెండో టెస్టులోనూ పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శణ చేస్తుండటంతో ఈ జాబితాలో ప్రస్తుతానికి పాక్ దే అగ్రస్థానం ఉండేలా కనిపిస్తోంది. సమీప దూరంలో భారత జట్టు టెస్టు సిరీస్ ఆడేది లేకపోవడంతో ఇక మన జట్టు ఇప్పట్లో ఈ జాబితాలో మెరుగయ్యే అవకాశం లేదు. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ తర్వాత.. డిసెంబర్ చివర్లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అంటే దాదాపు ఐదు నెలల పాటు టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి దూరంగా ఉండనుంది. ఇక వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ముగించుకున్న భారత్.. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం బ్రిడ్జ్ టౌన్ లో తొలి వన్డే ఆడనుంది.