గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వల్లభనేని వంశీ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ విలువ తగ్గినట్లు కాదని ఆయన అన్నారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ చాలా పెద్ద లీడర్లు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. తారక్ ని టీడీపీ వాడుకుని వదిలేసిందని అన్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వెళ్లారని, కెరీర్ ని పణంగా పెట్టి పాతికేళ్ల వయసులో టీడీపీ పార్టీ ప్రచారానికి తిరిగారని అన్నారు. ఆ సమయంలో తారక్ కి పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, ఆల్మోస్ట్ ప్రాణాలు పోయే స్థాయికి గాని లేకపోతే వెన్నుపూస పోయే స్థాయికి వెళ్లారని అన్నారు. అయితే భగవంతుడు ఆశీస్సుల వల్ల మళ్ళీ రికవర్ అయ్యారని అన్నారు.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2009 నుంచి 2014 లోపు జూనియర్ ఎన్టీఆర్ తిరిగిన రూట్ మ్యాపులు వేసి.. ఎన్టీఆర్ తిరిగిన ఊరు ఇది, ఈ ఊర్లో టీడీపీ ఓడిపోయింది, ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అంటూ అనేక దినపత్రికల్లో ప్రచురించారని వంశీ అన్నారు. లోకేష్ ని ప్రమోట్ చేయడానికి రాశారా? ఎన్టీఆర్ ఇమేజ్ ని తగ్గించడానికి రాశారా? అనేది జనానికి తెలుసని అన్నారు. తనను అవమానించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అవేమీ మనసులో పెట్టుకోకుండా 2014లో చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చారని అన్నారు. ఇక అమరావతి రైతులకు అండగా ఉండాలని ఎన్టీఆర్ ని లాగేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ తీరుపై వంశీ మండిపడ్డారు.
అమరావతి రాజధాని కోసం భూములు ఇవ్వండని గానీ, మీ తరపున నేను ఉంటానని గానీ ఏరోజైనా ఎన్టీఆర్ అన్నారా? ఈరోజు వీళ్ళకి ఇబ్బంది వచ్చిందని ఎన్టీఆర్ ని తిట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఎన్టీఆర్ కి అసలు సంబంధం లేదు. అతన్ని ఇంతకు ముందు ప్రచారం చేసినప్పుడు వాడుకుని కరివేపాకులా వదిలేశారు. 2014లో ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఏమైనా బ్యానర్ పెట్టారా? కనీసం స్వాగతం చెప్పారా? స్టేజ్ మీద కూర్చోబెట్టారా? కింద కూర్చోబెట్టారు. ఈరోజు వీళ్ళకి అవసరం వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ ని రా, రా అంటున్నారు. ఎన్టీఆర్ కి తన కెరీర్ ముఖ్యం కదా అని వంశీ అన్నారు.