రాజకీయాలు.. యుద్ధం రెండు ఒకేలాంటివి. అధికారం కోసం ప్రజాక్షేత్రంలో నేతలు కుస్తీ పడుతుంటే.. రాజ్యాల కోసం.. రాజులు తలపడవారు. అయితే రాజకీయాల్లో అయినా.. అటు యుద్ధ రంగంలో అయినా సరే గెలవాలంటే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాల్సింది. అయితే ప్రస్తుతం రాజ్యాల కోసం చేసుకునే యుద్ధాలు లేవు. కాకపోతే అధికారం కోసం మాత్రం నేతలు ప్రజాక్షేత్రంలో తలపడుతుంటారు. ఓటర్లే నేతలకు బలం. వారిని తమ వైపు ఆకట్టుకునేందుకు రకరకాల ప్రజాకర్షక పథకాలకు సంబంధించి హమీలు ఇస్తారు. డబ్బుల వర్షం కురిపిస్తారు. తిమ్మిని బమ్మిని చేసైనా సరే.. ఓటర్లను ఆకట్టుకుంటారు. అయితే మన దగ్గర కులాలు, మతాలు ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతాయో మేధావులు మొదలు.. సామాన్య ప్రజల వరకు అందరికి బాగా తెలుసు.
ఈక్రమంలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. పార్టీలన్ని ఆ దిశగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక వరుసగా రెండు సార్లు సత్తా చాటి.. ఈ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించి.. హ్యాట్రిక్ గెలుపును తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పటికే బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఇటీవల జరిగిన బీజేపీ కార్యకవర్గ సమావేశంలో.. రానున్న ఎన్నికలకు సంబంధించి మోదీ.. నేతలకు దిశానిర్దేశం చేశారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఎన్నికలకు సంబంధించి అనుసరించాలన్సిన వ్యూహాలను నేతలకు వివరించారు. దీనిలో భాగంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా మోదీ నోటి వెంట వెలువడ్డ పస్మాందా అనే దానిపై దేశ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి పస్మాందా అంటే ఏంటి.. ఎవరిని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడంటే..
బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసే క్రమంలో మోదీ.. సమాజంలోని అన్ని వర్గాలవారికీ దగ్గరవ్వాలని మరీ ముఖ్యమంగా ముస్లిం మైనార్టీలకు, అందులోనూ ‘పస్మాందా’ ముస్లింలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తద్వారా రానున్న ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చునని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పస్మాందా ముస్లింలు అంటే ఎవరు.. మోదీ వారి గురించే ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాడు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.
మన దేశంలో నివసించే ముస్లింలను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించారు. వారు అష్రఫ్‌లు, అజ్లఫ్‌లు, అలానే మూడో వర్గానికి చెందిన అర్జల్ ముస్లింలు. ఏంటి మేం ఈ పేర్లు ఎప్పుడు వినలేదు కదా అనుకుంటున్నారా.. అయితే వీరి గురించి మరింత వివరంగా చెప్పాలంటే..
పర్షియా, అరేబియా, తుర్కియే, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చిన సయ్యద్, షేక్, మొగల్, పఠాన్ ముస్లింలతోపాటు.. హిందూమంతలో నుంచి మతం మారిన రాజ్‌పుత్ ముస్లింలు, గౌర్ ముస్లింలు, త్యాగి ముస్లింలు.. వీరందరినీ అష్రఫ్‌లుగా పరిగణిస్తారు. వీరు సంపన్న ముస్లింలు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. అలాగే వీరిలో ఉన్నత విద్యావంతులు కూడా అధికంగా ఉంటారు.
వీరు రెండో రకానికి చెందిన వారు. సంప్రదాయ వృత్తులు వీరి ప్రధాన జీవనోపాధి. అంటే చేనేత, దర్జీ, కూరగాయల అమ్మకం తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. హిందువుల్లో ఓబీసీల మాదిరిగానే.. ముస్లింలలో వీరు కూడా వెనుకబడిన వారు.
వీరు ముస్లింలలో దళితులుగా పిలువబడుతున్నారు. నాయూలు, ఫకీర్లు, ధోబీలు, హలాల్ చేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు ఈ వర్గం కిందికి వస్తారు. వీరిని 1901లో తొలిసారిగా గుర్తించారు.
మరి పైన చెప్పుకున్న ముస్లింలకు.. పస్మాందా ముస్లింలకు తేడా ఏంటి.. అంటే.. ‘పస్మాందా’ అంటే విడిచిపెట్టినవారు.. వదిలేసిన వారు అనే అర్థం వస్తుంది. ఈ పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. ముస్లింలలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడిన తరగతుల వారని పస్మాందా ముస్లింలు అంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలోని 17 కోట్ల ముస్లిం జనాభాలో ‘పస్మాందా’ ముస్లింలే అధికంగా ఉంటున్నారు.
ముస్లిం జనాభాలో అత్యధిక శాతం.. అంటే 80-85 శాతం వీరే ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో పస్మాందా ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ద్వారా ముస్లింలకు లభించే ప్రయోజనాలన్నింటినీ తమలోని సంపన్నులే పొందుతున్నారనేది పస్మాందాల ప్రధాన ఆరోపణ.
బీజేపీపై మొదటి నుంచి ముస్లింలు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ముస్లింలలో పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవడం కోసం.. పస్మాందాలు టార్గెట్‌గా కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వీరికి చేరువయ్యి.. ఓట్లను పొందటం ద్వారా.. పార్టీపై ముస్లిం వ్యతిరేకత భావనను తొలగించుకోవాలని భావిస్తోంది. అయితే 2014 నుంచే ముస్లింలలో వెనుకబడిన పస్మాందాలను ఆకట్టుకోడానికి బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో దీన్ని అమలు చేసి.. వారిని ఆకట్టుకుని అనుహ్య విజయం సాధించింది. గెలిచి అధికారంలోకి వచ్చాక.. యూపీలో మైనార్టీ వ్యవహారాల శాఖను పస్మాందా వర్గానికి చెందిన దానిష్ ఆజాద్ అన్సారీకి అప్పగించి వారి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తోంది. అలానే మొన్నటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పస్మాందాల మద్దతు తమ విజయానికి కలిసొచ్చిందనేది బీజేపీ భావన.
తాజాగా ఇదే వ్యూహాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేయాలని మోదీ భావిస్తున్నారు. అందుకే అన్ని రాష్ట్రాల్లోని పస్మాందా ముస్లింలకు చేరువయ్యేందుకు ప్రణాళిలకు రచిస్తున్నారు. రెండు రోజుల క్రితం మోదీ మాట్లాడుతూ.. సినిమాలపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయవద్దంటూ నేతలకు సూచించాడు. ప్రధానంగా పఠాన్ సినిమాపై వస్తున్న విమర్శల్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ఇలా సూచించాడు. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే.. మోదీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి.. వారి ఓట్లను రాబట్టుకోవాలని భావిస్తున్నాడు. మరి రానున్న ఎన్నికల్లో మోదీ పస్మాందా అస్త్రం ఫలిస్తుందా లేదా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.