మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువార అనుచరులతో జరిగిన కీలక సమావేశంలో రాజీనామాను వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నా, రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేదని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు అనుచరుల వద్ద కన్నా చెప్పారు. అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మీడియా ద్వారా తన రాజీనామా విషయాన్ని తెలియజేశారు. ఆయనతో పాటు అనుచరులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. కాసేపట్లో పార్టీ పెద్దలకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ గురించి రాజకీయాలపై అవగాహన వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒక్కప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల్లో కన్నా ఒకరు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో బలమైన నేత ఉన్న కన్నా.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక గత కొన్నేళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల కారణంగా కన్నా 2014లో బీజేపీలోకి చేరారు. 2018లో ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తరువాత వివిధ కారణాలతో పార్టీ అధినాయకులు కన్నాను తప్పించి సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి కన్నా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఈక్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు అట్టిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని టాక్. గత కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగా లేదని కన్నా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర స్ధాయి బీజేపీ నేతలను కూడా కన్నా లక్ష్మీనారాయణ విమర్శిస్తూ వస్తున్నారు. గత కొంతకాలం నుండి జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టీడీపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. మరి.. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా.. ఏ పార్టీలో చేరబోతున్నారో తెలియాలంటే కొంత సమయం ఎదురు చూడక తప్పదు. మరి.. బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.