రాజకీయ నాయకులు ప్రజల్లోకి వచ్చి రాజకీయ సభలు నిర్వహించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతే. వారు జనాల్లోకి వచ్చినప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగి.. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు మరణించే అవకాశం ఉంటుంది. అయితే బహిరంగ సభల్లో ఇది మామూలే కదా అని అనుకోవడానికి లేదని కొందరు అంటున్న మాట. అసలు మనుషుల ప్రాణాలు పోయేలా సభలు పెట్టడం దేనికి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రతిపక్ష నేతల సభలకు పర్మిషన్లు ఇవ్వడం, ప్రతిపక్ష పార్టీలు జనాల గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా సభలు నిర్వహించడం వంటివి అస్సలు మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సభలు పెట్టాల్సిన అవసరమే లేదని అంటున్నారు. ఒక సభ పెడితే.. ఆ సభకు వచ్చే జనం ఎంత? సభలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఆ సమస్యను పరిష్కరించాలి? తొక్కిసలాట జరగకుండా సభ నిర్వహించడం ఎలా? అన్న ఆలోచనలు లేకుండా సభలు నిర్వహించడం మంచిది కాదని అంటున్నారు. ఇదే పెద్ద మనుషులు ఏదైనా దైవదర్శన సమయంలోనే తొక్కిసలాట జరిగితే.. అదిగో మీ యంత్రాంగం సరిగా పట్టించుకోలేదని నానా రభస చేస్తారు. ఎక్కడో జరిగిన దానికి అంతలా స్పందించినప్పుడు.. సొంత సభ పెట్టినప్పుడు ఎంత లోతుగా ఆలోచించాలి? అని జనం ప్రశ్నిస్తున్నారు.
జానాదరణ ఉన్నటువంటి వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే తొక్కిసలాట జరుగుతుంది. తమ వల్ల తొక్కిసలాట జరగకూడదని ఆగిపోయే వాళ్ళే అసలైన నాయకులు అన్న వాదన వినిపిస్తుంది. ఒకవేళ ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకోవాలి అనుకుంటే దానికి.. సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు వంటి వేదికలు ఉన్నాయి కదా అని అంటున్నారు. వాటి ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పవచ్చునని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంకా సులువైన పద్ధతి కదా అన్నది ప్రజల వాదన. ఒక ప్రెస్ మీట్ పెట్టి.. జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తే.. వారికి చేరువవుతుంది కదా అని అంటున్నారు.
ఈరోజుల్లో ఫోన్లు, టీవీలు లేని ఊర్లు ఉన్నాయా? అయినప్పటికీ జనాలతో ఇంటరాక్షన్ అవ్వాలంటే.. పార్టీ కార్యకర్తలని వాడుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. పార్టీ అధ్యక్షులు చెప్పిన మాటలను.. పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే సత్తా కార్యకర్తలకు ఉంది. కానీ అలా చేయకుండా జనాదరణ కలిగిన పార్టీ అధ్యక్షులు ఇలా జనాల్లోకి రావడం, బహిరంగ సభలు నిర్వహించడం వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతున్నారు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినప్పుడు.. డిజిటల్ మీడియా వేదికని ఎందుకు ఉపయోగించుకోకూడదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బహిరంగ సభల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది.
కేవలం ఆధిపత్యం కోసం, తమ బలం చూపించుకోవడం కోసం, తాము మీటింగ్ పెడితే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని చెప్పుకోవడం కోసమే ఈ మీటింగులు తప్ప.. జనాలకు ఏ ఉపయోగం లేదని అంటున్నారు. జనాలకు ఉపయోగం లేని పనులు ఎందుకు చేయడం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభల్లో 11 మంది చనిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇక సభలను వాయిదా వేసుకోవడమో, ప్రత్యామ్న్యాయంగా సోషల్ మీడియాని వాడుకోవడమో చేస్తే ఆయన పెద్దరికం నిలబడుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకుండా ఉంటే మంచిదని భావిస్తున్నారు.
అసలు ఇప్పుడున్న సాంకేతిక విప్లవానికి రాజకీయ సభలు అవసరం లేదని, వాటిని పూర్తిగా నిషేధిస్తేనే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిస్తే తప్పేంటి అన్న కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గానీ, ప్రతిపక్షం గానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది చూడాలి. ప్రజల కోసం పని చేస్తారో లేక ప్రయోజనాల కోసం పని చేస్తారో అనేది కాలమే నిర్ణయిస్తుంది. రాజకీయ నాయకులు సభలను నిర్వహించడంపై మీ అభిప్రాయమేంటి? నిర్వహించకపోవడమే మంచిదా? నిర్వహిస్తే మంచిదా? సభలను పూర్తిఘా నిషేదించాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.