సినీనటి జీవితారాజశేఖర్ కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, ఆయన కుటుంబం మాత్రమే బంగారమైందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు
సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతలు గురించి తెలుగు రాష్ర్ట ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా రాజశేఖర్ తనదైన నటనతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇటీవల కాలంలో కాస్తా వెండితెరపై కనిపించడంలో స్లో అయ్యారు. వారి సినీ వారసులుగా శివాత్మిక, శివాణిలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ దంపతుల రాజకీయం ప్రత్యేకమైనది. వీరు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిటీలోను చేరి.. తమదైన రాజకీయాలను నడిపించారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న జీవితారాజశేఖర్.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజల కళ్లల్లో నీళ్లు మాత్రమే మిగిలాయని ఆమె దయ్యబట్టారు.
శుక్రవారం ఉదయం బీజేపీ నాయకురాలు, సినీ నటి జీవితారాజశేఖర్ సిద్ధిపేట టౌన్ లోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆమె పోచమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ గుడి వద్ద నిర్వహించిన ‘ప్రజాగోస’ బీజేపీ భరోసా కార్నర్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలసి జీవితారాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సభకు ప్రారంభానికి ముందు ఆమె బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభలో పాల్గొన్న ఆమె.. కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచక పడ్డారు. తెలంగాణాలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. ప్రజల కళ్లల్లో ఆనందం ఏమో కానీ కన్నీళ్లు మాత్రం మిగిలాయని ఆమె అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందంటూ జీవితారాజశేఖర్ విమర్శించారు. సిద్దిపేట ప్రాంతంలో జరుగుతున్న ఘోరాలను చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని ఆమె అభిప్రాయపడ్డారు.
అలానే కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి కార్యక్రమం వల్ల అనేక భూ అక్రమాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కొనొకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు అనారోగ్యాలు పాలవుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. హరితహారం పేరుతో బీఆర్ఎస్ నాయకులు అనేక అక్రమాలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. దేశాన్ని మోదీ అగ్రరాజ్యంగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని జీవితారాజశేఖర్ ప్రజలను కోరారు. మీరు అందరూ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు 6359119119 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వండని జీవితారాజశేఖర్ ప్రజలను కోరారు. మరి.. కేసీఆర్ పై సినీ నటి, బీజేపీ నాయకురాలు జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.