కర్నూలు- విధి నిర్వహణలో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందులోను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, అత్యవసర విభాగంలో పని చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓ సర్కార్ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏకంగా ఓ రైలు ఆగిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో చోటు చేసుకుంది.
రైల్వే గేటు దగ్గర గేట్ మ్యాన్ రైలు వచ్చే సమయానికి రెడీగా ఉండి గేటు వేసి, రోడ్డుకు ఇరువైపుల అటు ఇటు వాహనాలను ఆపాలి. కానీ ఓ గేట్ మ్యాన్ మాత్రం విధి నిర్వహణలో ఉండి పీకల్లోతు మందు తాగి ఎంచక్కా నిద్రపోయాడు. రైలు వచ్చే సమయం అయినా గేటు వేయలేదు. దీంతో లోకోపైలెట్ ముందుగానే గమనించి ట్రైన్‌ను ఆపేశాడు. నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్ దగ్గర శ్రీనివాసులు గేట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆదివారం తన స్నేహితుడితో కలిసి అక్కడే ఫుల్ గా మందు తాగాడు. ఆ తరువాత అదే గదిలో నిద్రపోయాడు. అయితే సాయంత్రం ఆ మార్గంలో కర్నూలు నుంచి నంద్యాల డెమో ట్రైన్ వచ్చింది. ఫుల్ గా మధ్యం తాగి పడుకున్న గేట్ మ్యాన్ శ్రీనివాసులుకు ఆ విషయం తెలియదు. దీంతో గేటు వేయకపోవడాన్ని ముందుగానే గమనించిన లోకో పైలెట్ ట్రైన్ ను అక్కడే నిలిపివేశాడు. ఎంత హారన్ కొట్టినా మద్యం మత్తులో ఉన్న గేట్ మ్యాన్ మాత్రం నిద్ర లేవలేదు.
దీన్ని గమనించి స్థానికులు వచ్చి గదిలో నిద్రపోతున్న గేట్ మ్యాన్ ను లేపారు. అప్పుడు తీరిగ్గా లేచిన గేట్ మ్యాన్ శ్రీనివాసులు గేట్ వేయడంతో రైలు ముందుకు వెళ్లింది. ఈ విషయం రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి గేట్ మ్యాన్ శ్రీనివాసులును విధుల నుంచి సస్పెండ్ చేశారు. లోకో పైలెట్ గేట్ వేశారో లేదోనని గమనించకుండా ముందుకు వచ్చి ఉంటే ప్రమాదం జరిగేదని, అప్రమత్తంగా ఉన్న లోకో పైలెట్ ను అధికారులు అభినందించారు.