విశాఖపట్నం- సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. అందులోను అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలను తెచ్చినా దుర్మార్గుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. విశాఖపట్నం జిల్లాలో ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆ బాలిక అన్నయ్యా అని పిలిచినా వాడు కనికరించలేదు, కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు, అన్నయ్యను కాదు, మామయ్యను అవుతానంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది. అదే గ్రామానికి చెందిన గొడ్డు 22 ఏళ్ల నాగేశు, 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.
బాధిత బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వంట కోసం కట్టెలు తెచ్చేందుకు ఆమె సోదరి పక్కనే ఉన్న జీడితోటకు వెళ్లింది. దీంతో బాధితురాలు సైతం తోటకు బయలుదేరింది. ఇది గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. ఆ సమయంలో వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు.
ఆ బాలిక సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి తన మొబైల్ కు పంపించాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అలా ఆ బాలికను నాలుగు గంటలపాటు చిత్రహింసలకు గురిచేశాక రాత్రి 9 గంటల సమయంలో తనే ఇంటి వద్ద వదిలిపెట్టాడు. కుమార్తె కనిపించలేదని కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులు, ఆమె ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాసేపయ్యాక కూతురు చెప్పిన విషయం విని వారి గుండెలు బద్దలైపోయాయి.
బాధిత కుటుంబం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడు నాగేశును అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను వైద్య పరీక్షల కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.