ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే రక రకాల జబ్బుల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం మంచి ఆరోగ్యంతో ఉండవొచ్చు పెద్దలు చెబుతుంటారు.
సాధారణంగా వయసు మీదపడుతున్నవారు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల భారినపడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. అరవై డబ్భై ఏళ్లకే జీవిత కాలం అయ్యిందిరా బాబూ అంటూ నిట్టూరుస్తున్న రోజులివి ఇవి. దీనికి కారణం గాలి, నీరు కాలుష్యంతో పాటు మన ఆహారపు అలవాట్లే. కడుపునిండా తిన్నామా.. అనే ఆలోచన తప్ప ఏం తింటున్నాం అనేదానిపై దృష్టిసారించం. అలాంటిది ఓ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో రోజుకి 12 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఆయన వయసు ఇప్పుడు 101 ఏళ్లు. అంతేకాదు ఈ వయసులో కూడా ఆయనలో ఎంతో క్రీడాస్ఫూర్తి ఉంది. ఇప్పటికీ విదేశాల్లో జరిగే అథ్లెటిక్ పోటీలకు సన్నద్ధమవుతున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వి.శ్రీరాములు (101) ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటమే కాదు.. విదేశాల్లో జరిగే అథ్లెటిక్ పోటీలకు సిద్దమవుతున్నారు. 1923 జూలై 18న మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత అప్పటి రాయల్ ఇండియన్ నేవీలో చీఫ్ పెట్టీ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించారు. శ్రీరాములు 1979 డిసెంబర్ 31 న కమాండర్ హూదాలో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కుటుంబంతో విశాఖలో స్థిరపడ్డారు. వయసు మీద పడుతుంది.. విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు ఏనాడు అనిపించలేదు. తన ఆరోగ్యం కోసం నడక అలవాటు చేసుకున్నారు. ఆ అలవాటే ఆయనను క్రీడలవైపు మల్లించింది. రేస్ వాయింగ్, రన్నింగ్, షాట్ ఫుట్, డిస్కస్ త్రో లాంటి ఆటలు ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు.
క్రీడలే కాదు.. శ్రీరాములుకి పర్వతారోహణంపై కూడా ఎంతో మక్కువ.. అందుకే తన కుమారుడితో కలిసి 2002 లో ఆఫ్రికాలోని కిలిమంజారో, 81వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపు, 83వ ఏట హిమాలయాల్లోని పిండారి గ్లేసియర్ లను అధిరోహించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన 101 ఏట ఈ సంవత్సరం నవంబర్ 8 నుంచి 12 వరకు ఫిలిప్పిన్స్ లో జరగబోయే ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్ కాంపిటీషన్, వచ్చే సంవత్సరం జూన్ లో స్వీడన్ లో జరగబోయే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలకు సిద్దమవుతున్నారు. రేస్ వాయింగ్ పోటీల్లో 9 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు సాధించారు.
శ్రీరాములు తన ఆరోగ్య రహస్యం గురించి మాట్లాడుతూ.. ‘నేను దాదాపు యాభై ఏళ్ల నుంచి మిత ఆహారం, ఒంటిపూట భోజనం, నడక అలవాటు చేసుకున్నా.. ప్రతిరోజూ 12 కిలోమీటర్లు నడుస్తాను. ఉదయం పూట మొలకల చట్నీతో బ్రెడ్ టోస్ట్, కాఫీ తాగుతాను. మధ్యాహ్నం పెరుగు అన్నం.. సాయంత్రం కప్పు మజ్జిగ. రాత్రికి ఏమీ తినకుండా 8 గంటల వరకు నిద్రకు ఉపక్రమిస్తాను.. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల నా ఆరోగ్యం బాగుంది. నాకు షుగర్, బీపీ లాంటి సమస్యలు కూడా లేవు. మంచి ఆరోగ్యం కావాలంటే తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం చేస్తే చాలా మంచిది. అంతేకాదు క్రమశిక్షణతో కూడిన జీవితం చక్కటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది’అని అన్నారు.