ఉత్తర్ ప్రదేశ్- సాధారణంగా ఆస్పత్రులలో అప్పుడప్పుడు వైద్యం వికటించి రోగులు చనిపోతుంతారు. కొన్ని సందర్బాల్లో వైద్యుల నిర్లక్ష్యంవల్ల కూడా రోగుల ప్రాణాలు పోతుంటాయి. కానీ వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్ లో రోగి చనిపోతే.. ఏంటీ వినడానికే కాస్త కొత్తగా ఉందికదా. కానీ ఇది నిజంగానే జరిగింది.
ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీటీ స్కాన్ కోసం వెళ్తే ఓ చిన్నారి ప్రాణం పోయింది. ధనౌలి ప్రాంతానికి చెందిన వినోద్ తన మూడేళ్ల కుమారుడు దివ్యాంష్ నాలుగు రోజుల క్రితం ఇంటి మేడ మీద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో వెంటనే చిన్నారిని స్థానికంగా ఉండే నామ్నిర్ ఎస్‌ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దివ్యాంష్ ను పరీక్షించిన డాక్టర్లు చిన్నారికి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు.
ఈ నేపధ్యంలో దివ్యాంష్ తల్లిదండ్రులు బాలుడిని సుభాష్ పార్క్ ప్రాంతంలో ఉన్న అగర్వాల్ సీటీ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేయడానికి ముందు దివ్యాంష్ కు ఓ ఇంజక్షన్ ఇచ్చారు. అఆ తరువాత చిన్నారికి స్కాన్ చేశారు. అప్పటి వరకు బాగానే ఉన్న దివ్యాంష్, స్కాన్ చేసిన తరువాత హఠాత్తుగా ఆరోగ్యం విషమించి చనిపోయాడు. ఎంజరిగందో తెలియని తల్లి దండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ బాబును పరీక్షించిన వైద్యులు దివ్యాంష్ మృతి చెందాడని చెప్పారు. దీంతో సీటీ స్కాన్ సెంటర్ లో తప్పిదం వల్లే చనిపోయాడని దివ్యాంష్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్ సెంటర్ వద్దకు వెళ్లగా, అప్పటికే దానికి తాళం వేసి ఉంది. దివ్యాంష్ తల్లి దండ్రులు, బంధువులు చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్ సెంటర్ బయట కూర్చుని ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి, అగర్వాల్ సీటీ స్కాన్ సెంటర్ నిర్వహకులు, సిబ్బంది మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు బాగానే ఉన్న తమ బిడ్డ కాసేపట్లోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లితండ్రుల కన్నీరు మున్నీరయ్యారు.