చెన్నై- నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి వారు సతమతమవుతున్నారు. చాలీ చాలని జీతాలతో బతకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. అందులోను పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు సామాన్యులు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటేసింది.
ప్రతి రోజు చమురు ధరలపై రివ్యూ చేస్తన్న కంపెనీలు, ఎంతో కొంత ధరను పెంచేస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నాయు. ఇదిగో ఇటువంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు కాస్త ఉరటనిచ్చే పని చేసింది. పెట్రోల్ ధరను కొంతమేర తగ్గిస్తూ స్టాలిన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై 3 రూపాయల చొప్పున సుంకం తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో రివైజ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన స్టాలిన్ సర్కార్ ప్రకటించింది. ఈ తమ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకు కొంతైనా ఊరట కలుగుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై 1,160 కోట్ల రూపాయల మేర భారం పడనుందని, అయినప్పటికీ సామాన్యులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని సీఎం చెప్పారు.
స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం చెన్నైలో 103 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలకు తగ్గనుంది. ఇక పెట్రోల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని తమిళనాడు సర్కార్ విమర్శించింది. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సమాన్యులు కోరుతున్నారు.