శ్రీకాకుళం- ఈ ప్రపంచంలో రకరకాల జబ్బులు మనుషులను వేదిస్తుంటాయి. మనవుడు తన మేధోసంపత్తితో ఎన్నో జబ్బులకు చికిత్సను, మందులను కనుగొన్నాడు. కానీ క్యాన్సర్ లాంటి కొన్ని అరుదైన అనారోగ్య సమస్యలకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి రాలేదు. ఇక మరి కొంత మందికి చాలా అరుదుగా మరికొన్ని జబ్బులు పట్టిపీడిస్తుంటాయి. లక్షల్లో, కోట్లల్లో ఒకరికి వచ్చే ఇలాంటి జబ్బులను నయం చేయడం వైద్యులకు కూడా కష్టమేనని చెప్పవచ్చు.
ఇదిగో ఇలాంటి అరుదైన జబ్బుతో బాధపడుతోంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ విద్యార్ధిని. ఈ బాలిక జబ్బు గురించి వింటే వింతతో పాటు ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పట్టు మహాదేవి కోనేరు గట్టుపై నివాసం ఉండే బెల్లన జ్యోతి అనే బాలిక కంట్లో నుంచి ఇసుక వస్తోంది. గత పదేళ్లుగా జ్యోతి ఈ సమస్యతో బాధపడుతోంది. ఎంతో మంది వైద్యులకు చూపించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం.
జ్యోతి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోలడంచో తల్లి కూలీ పనులు చేస్తూ ఆమెను చదివిస్తోంది. వింత కంటి వ్యాధితో బాధపడుతున్న జ్యోతిని విశాఖపట్నం తీసుకెళ్తే నయం కావొచ్చని కొంత మంది డాక్టర్లు సూచించారు. ఐతే తమ ఆర్ధిత పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో, టెక్కలి అభయం యువజన సేవాసంఘం ఆమెను వైజాగ్‌లోని శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్‌లో చూపించారు. ఐనప్పటికీ వైద్యులు ఆమె సమస్య ఏంటో నిర్ధారించలేకపోయారు.
దీంతో అరుదైన కంటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని, ప్రభుత్వం స్పందించి వైద్యం చేయించాలని బాధితురాలు వేడుకుంటోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి కంటి సమస్య చూడలేదని చాలా మంది వైద్యులు చెబుతున్న నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పధంతో ఈ నిరుపేద విద్యార్ధినికి వైద్యం అందించి ఆదుకోవాలని మనమూ కోరుకుందాం.