ఆ అమ్మ నమ్మకం ఒమ్ము కాలేదు. ఆ తండ్రి కష్టం వృధాగా పోలేదు. 50 రోజుల నెల్లూరు జిల్లా పోలీసుల శ్రమకి ఓ మంచి ముగింపు లభించింది. అన్నిటికీ మించి ఆ పిల్లాడు మృత్యంజయుడిగా తిరిగి తన అమ్మ ఒడిని చేరుకున్నాడు. అవును.. 50 రోజుల క్రితం అడవిలో తప్పిపోయిన సంజు అనే పిల్లాడి గురించే ఇదంతా. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన దండు బుచ్చయ్య, వరలక్ష్మి దంపతుల కొడుకు సంజు 50 రోజుల క్రితం అడవిలో తప్పిపోయాడు. సంజు ఆచూకీ కోసం జిల్లా పోలీసులు అన్నీ విధాలా వెతికారు. ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. కానీ.., ఎక్కడా సంజు జాడ కనిపించలేదు.
ఎన్ని రోజులు అయినా పిల్లాడు కనిపించకపోవడం ఏ క్రూర జంతువైనా పిల్లాడిని తినేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. కానీ.., సంజు తల్లి నమ్మకాన్ని వదులుకోలేదు. నా బిడ్డకి ఏమి అయ్యి ఉండదు. వెతుకులాట ఆపకండి అంటూ పోలీసులను వేడుకుంది. సంజు లేడని కేస్ క్లోజ్ చేయడానికి కనీసం ఆధారాలు కూడా లేకపోవడంతో పోలీసులు కూడా అడవిలో గాలింపు చేస్తూ వచ్చారు. అయితే.., ఇప్పుడు ఎట్టకేలకు సంజు జాడ తెలిసిందని సమాచారం అందుతోంది.
సంజూ నెల్లూరు జిల్లాలోనే ఉన్న దగదర్తిలో మండలంలో సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు అందించిన సమాచారం మేరకు ఫోటోను చూసిన తల్లిదండ్రులు ఇతను తమ బిడ్డే అని నిర్ధారించారు. దీంతో వెంటనే సంజు తల్లిదండ్రులను పోలీసులు దగదర్తికి తీసుకెళ్లారు. అడవిలో బాబు ఎవరికైనా దొరికితే.., వారు బాబుని తీసుకెళ్లి పెంచుకోవచ్చు కదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. దీంతో.. అడవికి పక్కనే ఉన్న దగదర్తి మండలంలో కూడా వెతుకులాట సాగించడంతో సంజు ఆచూకీ లభ్యం అయింది. ఏదేమైనా.., 50 రోజుల క్రితం అడవిలో తప్పిపోయిన సంజు ఆచూకీని కనిపెట్టడంతో నెల్లూరు పోలీసులపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.