Sneha Sirivara: ఆలోచన చిన్నదే కావచ్చు.. ఆ ఆలోచనకు ఓ జీవితాన్నే మార్చే శక్తి ఉంటుంది. అందరిలా కాకుండా.. భిన్నంగా ఓ మంచి ఆలోచన చేస్తే.. ఆ ఆలోచన పది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఇందుకు స్నేహ సిరివర జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. జీతం కోసం ఉద్యోగంలోనే ఉండిపోయి ఉంటే స్నేహ సిరివర గురించి మనం ఇప్పుడు చర్చించుకునేవాళ్లం కాదు. అలా అందరిలా కాకుండా.. జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకుని జీవితం వైపు అడుగులు వేసింది. వంటను మరింత రుచిగా మలిచే మసాలాల తయారీలో తన సత్తా చాటింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు వ్యాపారాన్ని విస్తరింపజేసింది.
ఈ ఆలోచన అలా మొదలైంది…
కర్ణాటకకు చెందిన స్నేహ సిరివర ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తికాగానే విప్రోలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా జాబ్‌లో చేరింది. ఓ సంవత్సరం పాటు పనిచేసింది. అయితే, ఒక సంవత్సరానికే ఆ ఉద్యోగం అంటే ఆమెకు చికాకు పుట్టింది. తాను కలలు కన్న జీవితం ఇది కాదు అనుకుంది. ఎప్పటినుంచో ఆమెకు బిజినెస్ మొదలుపెట్టాలనే ఆలోచన ఉండేది. నిరంతరం ఆ ఆలోచనే ఆమె మనసును తొలుస్తూ ఉండేది. ఓ సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత బిజినెస్ చేయాలనే ఆలోచనను గట్టిగా పట్టుకుంది. దేశంలో ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్ వంటకాలకు సంబంధించిన మసాలాలు ఇట్టే దొరికేస్తున్నాయి. కానీ, సౌత్ ఇండియన్ వంటకాలకు సంబంధించిన మంచి మసాలాలు చాలా తక్కువ దొరుకుతూ ఉన్నాయి.
విదేశాలకు వెళ్లే ఆమె బంధువులు ఇంటినుంచి మసాలాలను తీసుకెళుతూ ఉండేవారు. వారిలో చాలా మందికి స్నేహనే స్వయంగా మసాలాలు తయారు చేసి ఇచ్చేది. అవి తిన్న వారు అద్భుతంగా ఉన్నాయంటూ కితాబునిచ్చేవారు. వారి పొగడ్తల కారణంగా ఆమెలో ఓ ఆలోచన మొదలైంది. వంటలకు మంచి రుచిని అందించే మసాలలపై దృష్టి పెట్టింది. రసాయనాలు లేని సౌత్ ఇండియన్ మసాలాలు తయారు చేయాలని డిసైడ్ అయింది. ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో ‘‘సాంబార్ స్టోరీస్’’ పేరిట మసాలాల బిజినెస్ స్టార్ట్ చేసింది.
ఇంటినుంచే బిజినెస్.. తల్లిదండ్రుల ప్రోత్సాహం…
మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని కూతురు మసాలాల వ్యాపారం చేయటం ఆమె తల్లిదండ్రులకు బొత్తిగా ఇష్టంలేదు. స్నేహ ఆసక్తి చూసి కాదనలేకపోయారు. ఇంటినుంచే వ్యాపారం మొదలుపెట్టింది. మొదట్లో మసాలాలు మాత్రమే తయారుచేసింది. తర్వాత వ్యాపార విస్తరణలో భాగంగా చట్నీ పౌడర్‌లు, కాఫీ పౌడర్, పచ్చళ్లు, రెడీమేడ్ మిక్స్‌లు, స్నాక్స్ తయారు చేసింది. తల్లిదండ్రులు ఆమెకు సహాయం అందించేవారు. గ్యారెజ్‌నే ఓ యూనిట్‌లాగా మలిచి అక్కడ మసాలాలు తయారు చేసేవారు.
కష్టాలు దాటుతూ.. ఒక్కో అడుగు ముందుకు..
తల్లిదండ్రులు సహాకారం అందిస్తున్నా.. ఎక్కువ మొత్తంలో పనిని స్నేహే చేసుకునేది. అన్నీ ఒక్కత్తే చూసుకునేది. బిజినెస్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవటంతో అంతా కష్టంగా తయారైంది. అయితే, తనకేం కావాలో ఆమెకు క్లారిటీ ఉండటంతో కష్టం కూడా ఇష్టంగా మారిపోయింది. కష్టం వచ్చిన ప్రతీసారి ‘‘ నేను అమ్మే పదార్ధాలతో వంట చేసుకుతిన్న వారు ఇంటి వంటను గుర్తు తెచ్చుకోవాలి’’ అనుకుంటూ పనిచేసేది. మసాలాల రుచి బాగుండటంతో డిమాండ్ పెరుగుతూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా వ్యాపారం చేయటం మానలేదు. అత్తారింటివాళ్లు తమిళులు కావటంతో తమిళనాడులో కూడా వ్యాపారాన్ని విస్తరింపజేసింది. రోజు రోజుకు ఆర్డర్లు పెరగసాగాయి. వ్యాపారం విస్తరిస్తూ వచ్చింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వేలాది మంది హార్డ్‌కోర్ కస్టమర్లను సంపాదించుకుంది. చిన్న మిక్సీతో ప్రారంభమైన వ్యాపారం పెద్ద పెద్ద మిషిన్ల వరకు వచ్చింది. ఓ పది మందికి ఉపాధి ఇస్తోంది. కోట్లు పెట్టినా కొనుక్కోలేని నమ్మకాన్ని, బ్రాండ్‌వాల్యూని సంపాదించుకుంది. నెలకు దాదాపు 5 లక్షల రూపాయల ఆదాయం పొందుతోంది. మరి, స్నేహ సక్సెస్‌ఫుల్ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Odisha: స్కూల్ డ్రాపౌట్ ప్రతిభ.. ప్లాస్టిక్‌తో పెట్రోల్.. లీటర్‌కు 50కిమీ మైలేజీ!