పంజాబ్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర భారతం మొత్తం వరదలకు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు సమయంలో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్న మహిళా అధికారుల గురించి మాట్లాడుకుందాం..
ఉత్తర భారతదేశం మొత్తం వరదలతో మునిగిపోయింది. పంజాబ్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు కుంభవృష్టి కురిసింది. నదులు, వాగులు ప్రమాద స్థాయిని మించి ప్రవహించాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వృక్షాలు కూకటి వేళ్లతో పెకిలించబడ్డాయి. కార్లు, ఇతర వాహనాలు వదరలో కొట్టుకుపోయాయి. నిరంతరం దంచికొట్టిన వర్షాలతో ప్రకృతి విలయతాండవం చేసింది. ఇలాంటి సమయాల్లో మనుషులు బయటికి రావడానికే భయపడుతుంటే తమ ధీరత్వాన్ని ప్రదర్శించారు కొందరు మహిళా అధికారులు. ప్రకృతి సవాళ్లకు ఎదురునిలబడి సహాయక బృందాలను సమాయత్తం చేసి, లోతట్లు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తున్న పనుల్లో తాము స్వయంగా పాల్గొని రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారిని ప్రజలు మెచ్చుకుని, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నార్త్ ఇండియాలోని భారీ వర్షాల గండం పంజాబ్‌లోని పాటియాల జిల్లాకు కూడా వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ సాక్షి సహానె వెంటనే తన మూడేళ్ల కుమార్తెను తన పేరెంట్స్ దగ్గర వదిలేసి విధుల నిర్వహణకు బయలుదేరారు. దాదాపు 7 రోజులపాటు జిల్లా అంతటా పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. పాటియాలలోని సట్లజ్ యమున లింక్ కెనాల్‌కు ఎగువనున్న వరద నీరు చేరడంతో ఒక్కసారిగా చిత్కారా యూనివర్సిటీ, నీలమ్ హాస్పిటల్ రెండూ వరదలో చిక్కుకున్నాయి. నీలమ్ ఆస్పత్రిలోని పేషెంట్లను, 14 మంది ఐసీయు పేషెంట్లను ఇతర ప్రాంతాలకు క్షేమంగా తరలించారు. చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులను ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ దళాల సాయంతో బయటికి తరలించారు. సులూర్ గ్రామంలో వరదలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్న విషయం సహానె తెలుసుకున్నారు. అర్థరాత్రి అనికూడ ఆలోచించకుండా వరదనీరు కారు అద్దాలవరకు వచ్చినా తెగించి అక్కడికి చేరుకున్నారు. అక్కడి ప్రజలకు ఆహారం అందించారు. 2014 ఐ.ఏ.ఎస్. బ్యాచ్ కు చెందిన సాక్షి సహానె తన చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల మెప్పును పొందారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లా ఎస్.పి సాక్షివర్మను అందరు ‘లేడి సింగం’ అంటారు. సిమ్లాలో విధులు నిర్వహించే రోజుల్లో బ్రౌన్ షుగర్ సప్లై చేసే ముఠాను పట్టుకుంది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్‌లైన్, ‘హోషియార్ సింగ్’, ‘శక్తి బటన్’ అనే హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసింది. ఇటీవల వరదల్లో పెద్ద సవాలును ఎదుర్కొన్నారు. కుల్లు జిల్లా టూరిస్ట్ ప్లేస్‌లలో కమ్యునికేషన్ కోల్పోవడం పెద్ద సవాల్. మొబైల్స్ సిగ్నల్స్ అందలేదు. పోలీసుల వైర్ లెస్ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పనిచేశాయి. ఇతర ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు పంపి అక్కడి సమాచారాన్ని తెలుసుకున్నారు. వరదల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సహాయక బృందాలు చేరలేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అయినా సరే ఆ సమయంలో స్త్రీ, పురుషులు అని ఆలోచించకుండా సమర్థవంతంగా సహాయక చర్యలు అందించారు. 2014 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన సాక్షి వర్మ అక్కడి ప్రజల అభిమానం పొందారు.
మరో మహిళా అధికారిని మండి ఎస్.పి. సౌమ్య సాంబశివన్. వరదల సమయంలో బియాస్ నది ఒడ్డున ఉన్న స్లమ్స్ లో చిక్కుకున్న 80 మందిని కాపాడగలిగారు. అది టూరిస్ట్ ప్రాంతం కాబట్టి అక్కడి ప్రాంతంలో టూరిస్ట్ లు ఎలా ఉన్నారన్న ఫోన్లు వరదలా రావడంతో పెద్ద సవాల్ ఎదురైంది. అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లను సురక్షితంగా ఉంచడం ఆమె ముందున్న సమస్య. వారందిరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చారు. అక్కడి వారు కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు, వస్తువులను వదిలి రావడానికి రాకపోయినా.. వారిని ఒప్పించి ఖాళీ చేయించారు. సౌమ్య సాంబశివన్ కింద 1200 మంది సిబ్బందిని తీసుకుని సహాయక చర్యలు కొనసాగించింది. 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన సౌమ్య అందరి ప్రశంసలు పొందారు.