సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు తిని.. తినక.. రూపాయి రూపాయి పోగు చేసి.. బ్యాంకుల్లో దాచుకుంటారు. అక్కడైతేనే తమ డబ్బుకు భద్రత అని భావిస్తారు. కానీ కొందరు బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి… ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 42 లక్షల రూపాయల నగదు నీటిపాలయ్యింది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో.. వారు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. నగరంలోని పాండు నగర్ బ్రాంచ్‌లో ప్రధాన కరెన్సీ చెస్ట్ ఉంది. దీనిలో నీరు చేరడంతో.. సుమారు 42 లక్షల రూపాయల కరెన్సీ నోట్లు తడిసిపోయాయి. అయితే బ్యాంక్ అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కానీ కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ అధికారుల బృందం బ్యాంక్ కరెన్సీ చెస్ట్‌ను ఆడిట్ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యులుగా గుర్తిస్తూ.. సీనియర్ మేనేజర్‌తో సహా నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
ఆడిట్‌లో భాగంగా ఆర్బీఐ అధికారులు నీళ్లలో తడిచి ముద్ధైన నోట్లను గుర్తించారు. అయితే తొలుత సుమారు 2 లక్షల రూపాయల వరకు నోట్లు తడిచిపోయి ఉంటాయని భావించారు. కానీ వారం రోజుల పాటు ఆ నోట్లను లెక్కించగా.. ఆ మొత్తం 42 లక్షల రూపాయలకు చేరింది. పెట్టెను నెలపై ఉంచడం వల్ల దానిలోకి నీరు చేరి.. నోట్లు తడిసిపోయి.. కుళ్లిపోయాయని వెల్లడయ్యింది. ఈ విషయం కాస్త బయటకు తెలియడంతో జనాలు పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు అని మండిపడుతున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.