మరి కొద్దిరోజుల్లో భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. విపక్షాలు సైతం అభ్యర్ధిని బరిలో దించడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు పోటీ ఇద్దరు దక్షిణ భారతీయుల మధ్య నెలకొంది. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్ధులెవరు, చదువు, ఉద్యోగం, బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది తెలుసుకుందాం.
భారతదేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా నేపధ్యంలో తలెత్తిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అటు ఎన్టీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి నుంచి ఇద్దరు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్ బరిలో ఉంటే, ఇండియా కూటమి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని పోటీలో నిలుపుతోంది. ఈ ఇద్దరూ దక్షిణ భారతీయులే కావడం విశేషం. ఒకరు తెలంగాణ నుంచి అయితే మరొకరు తమిళనాడు నుంచి. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్ధులు ఏ చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, కుటుంబ నేపధ్యమేంటనేది చెక్ చేద్దాం.
ఎన్డీఏ కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్
ఈయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ కాగా స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. 1957 మే 4న జన్మించిన ఈయన బీబీఏ చదివారు. 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌లో చేరి క్రమంగా జన్‌సంఘ్, బీజేపీలో కీలకనేతగా ఎదిగారు. 1998, 1999లో బీజేపీ ఎంపీగా కోయంబత్తూరు నుంచి గెలిచి ఆ తరువాత 2004, 2009, 2019లో ఓడిపోయారు. 2023 ఫిబ్రవరిలో జార్ఘండ్ గవర్నర్‌గా చేసిన ఈయన ప్రస్తుతం అంటే గత ఏడాది జూలై 31 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. తెలంగాణకు అదనపు గవర్నర్‌గా పనిచేశారు.
ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
పూర్తి పేరు బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి కాగా స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం. న్యాయశాస్త్రం నుంచి ఉస్మానియా యూనివర్శిటీ పట్టా తీసుకున్నారు. 1988లో ఏపీ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడరుగా నియమితులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1993లో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1993 మే 2న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2007 జనవరి నుంచి 2011 జూలై వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. పదవీ విరమణ అనంతరం గోవా మొదటి లోకాయుక్తగా పనిచేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు
ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంది. 25వ తేదీ నాటికి నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 సభ్యుల బలం ఉంది.