దేశంలో కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతోపాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రీట్ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలిసింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టటంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి డ్రైవ్ చేయటం వంటి పలు కారణాలతో భారత్ లో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలతో బాధితుల కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. 2019లో అతి వేగం కారణంగా ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ప్రతిరోజూ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.. ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన ఫలితాలు మాత్రం శూన్యం అని అంటున్నారు.
