ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపింతో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
భారత దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబాని తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేకవాకార్యక్రమాలు చేస్తుంటారు. ప్రకృతి విపత్తు సంభవించినపుడు, భారీ ప్రమాదాలు జరిగి సర్వం కోల్పోయిన వారి కోసం ఆమె ఎన్నోసార్లు ఆర్థిక సాయం అందించారు. తాజాగా ముఖేష్ అంబానీ దంపతులు ఈ మద్య జరిగిన ఒడిశా రైలు ప్రమాద బాధితులకు తమ మద్దతు ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. యావత్ భారత ప్రజలు ఒక్కసారే ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో వందల మంది చనిపోగా.. వెయ్యిమందికి పైగా తీవ్ర గాయాలపాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. ఎంతోమంది పెద్దదిక్కు కోల్పోయి అనాథలుగా మిగిలారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ముందుకు వచ్చారు. ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరుపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు నీతా అంబాని. ప్రమాదం జరిగిందని తెలియగానే.. తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృంద సభ్యులు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.
బాధిత కుటుంబాలకు ఆరు నెలల పాటు రిలయన్స్ స్టోర్ల ద్వారా పిండి, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనె, చక్కర తో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ఇక అత్యవసర సహాయం కోసం అంబులెన్స్ లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత చికిత్స, మందుల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. రైళ్ల ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఎంత విషాదంలో మునిగిపోయి ఉంటాయో అందరికీ తెలిసిందే.. వారికి మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు వారి జీవితాలు ముందుకు సాగేలా చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఫౌండేషన్ తెలిపింది. ఈ సందర్భంగా నీతా అంబాని బాధిత కుటుంబాలకు పలు హామీలు ఇచ్చారు.
– ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారికి వీల్ చైర్స్, ప్రొస్టెసేస్ తో సహాయ సహకారాలు అందించడం
– కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పోయిన మహిళలకు మైక్రో ఫైనాన్స్, శిక్షణ అవకాశాలు కల్పించడం
– ప్రమాదం తీవ్ర ప్రభావం చూపిన గ్రామీణ కుటుంబ సభ్యులకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కోసం గేదె, ఆవు, మేక, కోడి వంటి అందించడం
– ప్రమాదంలో గాయపడిన వారి కోసం ఉచిత మందులు, ఆసుపత్రుల్లో వైద్య చికిత్స
– మరణించిన వారి కుటుంబంలో ఒకరికి జియో, రిలయన్స్ రిటైల్ ద్వారా ఉపాధి అవకాశం
-మరణించిన వారి కుటుంబ సభ్యునికి జియో ద్వారా ఏడాది పాటు ఉచిత మొబైల్ కనెక్షన్
-బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.. వారు కోలులుకోవడానికి కౌన్సిలింగ్ సేవలు