గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల పుణ్యాన నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు ఆ నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇంతకీ ఎలుకలు ఏం చేశాయి? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
దేశాన్ని, యువతను పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. మత్తుకు బానిసై యువత వారి భవిష్యత్ ను అందకారంలోకి నెట్టేసుకుంటున్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మాదకద్రవ్యాల మత్తులో పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ కు బానిసై వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల కారణంగా నిర్దోషులుగా బయటికొచ్చారు. కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించి, కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఇది వినడానికి విడూరంగా ఉన్నా చెన్నైలో నిజంగానే జరిగింది. ఇంతకీ ఎలుకలకు, గంజాయి కేసుకు ఉన్న లింకేంటి? నిందితులు నిర్దోషులుగా ఎలా మారారు? అనే వివరాలు మీకోసం..
కఠినమైన రూల్స్ ఉన్నా, పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నప్పటికి డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. కాగా రెండేళ్ల క్రితం మెరీనా బీచ్ లో ఇద్దరు స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి 22 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. అందులోంచి కొంత భాగాన్ని పరీక్షల కోసం పంపించారు. పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పించారు. అప్పటి నుంచి ఈ కేసు చెన్నై మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోది. సీజ్ చేసిన 22 కేజీల గంజాయిలో టెస్టుల కోసం కొంత పోగా 21 కేజీల 900 గ్రాముల గంజాయిని పోలీసుల భద్రపరిచారు.
అయితే కేసు విచారణ సమయంలో ఎవిడెన్స్ గా గంజాయిని చూపించాల్సిన సమయంలో పోలీసులు వారి ఆధీనంలో ఉన్న 21 కేజీల 900 గ్రాముల గంజాయికి బదులు 11 కేజీలు మాత్రమే కోర్టుకు సమర్పించారు. మిగిలిన మొత్తం ఏమైందని కోర్టు పోలీసులను ప్రశ్నించగా ఎలుకలు తిన్నట్లుగా చెప్పారు. పోలీసులు చెప్పిన ఈ సమాధానం తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు చార్జ్ షీట్లో తెలిపిన విధంగా కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయారని, దీంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. గంజాయి నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఎలుకల పుణ్యమాని నిందితులు జైలు శిక్ష తప్పించుకోవడంతో చర్చకు దారితీసింది. ఇక ఈ ఘటనపై నిజంగానే ఎలుకలు తిన్నాయా.. లేదా ఇంటి దొంగల పనేనా అనే భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.