మనిషి యొక్క మనుగుడ కొనసాగాలంటే ఆహారంతో పాటు నీరు ఎంతో అవసరం. కొన్ని సార్లు ఆహారం లేకున్నా మంచినీరు తాటి బతికే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న నిర్లక్ష్యం, తప్పుల వల్ల నదులు, చెరువులు, సరస్సులు కలుషితమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం నీటిని కలుషితం చేసి మన జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాం.
ఇక మన దేశం ఎంతో అభివృద్ది చెందుతుందని చెబుతున్నా.. కొన్ని ప్రాంతాల పరిస్థితి చూస్తే దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటి కష్టాలు ఇప్పటికీ తీరడం లేదు. గుక్కెడు మంచి నీటి కోసం కిలోమీటర్లు ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఇంకా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రజలకు నేటికీ శుద్ధమైన మంచినీరు దొరకడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
రాజస్తాన్ కరౌలి జిల్లాలో కలుషిత కలుషిత నీరు తాగి 120 మంది వరకు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వారందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిమారా గ్రామంలో ఉన్న బావిలోని నీటిని తాగిన గ్రామస్థులు కొద్ది గంటల వ్యవధిలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చారు అధికారులు. అయితే అక్కడ సరైన వసతులు లేని విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
పడకలు లేక ఒకే బెడ్ పై ఆరుగురు పిల్లలను పడుకొబెట్టారు. వందల మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో వైద్యబృందం గ్రామానికి చేరుకుని బావిని పరిశీలించగా.. ఆ నీటిలో పురుగులు కనిపించాయి. ఈ కారణం చేతనే ఆ నీటిని సేవించిన వారు అస్వస్థతకు గురయ్యారని అధికారులు వెల్లడించారు.
బావిలోని మురికి నీటిని ఎవ్వరూ తాగవద్దని ఆరోగ్యశాఖ అధికారులు గ్రామస్థులకు సూచించారు. పరీక్షల కోసం నీటి నమూనాలు కూడా తీసుకున్నారు. వెంటనే చుట్టు పక్కల ఉన్న బావుల్లో బ్లీచింగ్ పౌడర్ వేశారు. ప్రస్తుతం గ్రామంలో నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా ట్యాంకర్లను తెప్పించామని అధికారులు తెలిపారు. ఈ విషయం పై మీఅభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.