కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల ప్రపంచదేశాలను అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్యసంస్థ. గతంలో పలు దేశాలను వణికించిన డెల్టా వేరియంట్ కంటే అనేక రెట్లు ఒమిక్రాన్ ప్రమాదకరమైనదని డబ్లూహెచ్‌వో హెచ్చరించింది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్‌లలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో చాలా దేశాల ఈ దేశాల నుంచి ప్రజారవాణా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అనునిత్యం నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని డబ్లూహెచ్‌వో సూచించింది.
కాగా, ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా కొత్త వేరియంట్ గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం సహా నిఘా పెంచాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలన కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తేసే విషయంలో మరోసారి సమీక్ష చేయాలని చెప్పారు. దేశంలో వచ్చే ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి, శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ అధికారులకు ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖామంత్రులు వైద్యసిబ్బందికి సూచనలు చేశారు.