ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క. ఇంటర్ నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వాడకం మరీ ఎక్కువ అయ్యింది. ఎంతగా అంటే చిన్న పిల్లలు మారాం చేస్తే సెల్ ఫోన్లో బొమ్మలు, పాటలు పెడితే చాలు సైలెంట్ అవుతుంటారు.. యూత్ అయితే గంటల కొద్ది సెల్ తోనే గడుపుతున్నారు. ఒకరకంగా చెప్పాంటే సెల్ ఫోన్ మాయలో పడి మనిషి ఆకలి దప్పికలు కూడా మర్చిపోయే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ఒకరకంగా మొబైల్ ఫోన్ల వల్ల మానవసంబంధాలు పూర్తిగా అంతరించిపోతున్నాయని అంటున్నారు. మొబైల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.
సెల్ ఫోన్ లో అతిగా మాట్లాడితే ఎన్నో అనర్ధాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నా కొంత మంది దాన్ని అస్సలు పట్టించుకోరు. కాన్వెంట్ చదివే పిల్లల నుంచి హైస్కూల్ విద్యార్థుల వరకు ఇంటికి రాగానే ముందుగా సెల్ ఫోన్ కోసమే వెతికే పరిస్థితి నెలకొంది.. ఎక్కువ సమయం సెల్ ఫోన్ వాడితో వాటి నుండి వెలువడే రేడియేషన్స్ తో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఓ గ్రామంలో సెల్ ఫోన్ వాడకంపై వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలు మొబైల్ వాడకంపై నిషేదం ప్రకటించారు. ఈ రూల్ తల్లిదండ్రులు కూడా పాటించాలని.. ఒకవేళ నిషేదాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు గ్రామ పెద్దలు.
మహారాష్ట్ర లోని బన్సీ అనే ఒక గ్రామంలో కొంత కాలంగా స్కూల్, ఇంటర్ విద్యార్థులు సెల్ ఫోన్ మాయలో పడి చదువుని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు గ్రామ పెద్దల నోటీసుకి వచ్చింది. దాంతో మొబైల్ ఫోన్ వాడకంపై ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో 18 లోపు ఉన్న పిల్లలు ఎవరు కూడా సెల్ ఫోన్ వాడటానికి వీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి పాడు చేస్తున్న తల్లిదండ్రులకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని సభ తీర్మాణం చేసింది. ఒకవేళ నిషేదాన్ని ఉల్లంఘించినట్లుయితే ఖచ్చితంగా జరిమానా చెల్లించాలని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా బన్సీ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే సమయంలో సెల్ ఫోన్లు కొనాల్సి వచ్చింది.. అప్పటి నుంచి పిల్లలు సెల్ ఫోన్ కి బాగా అలవాటుపడ్డారు.. కొంతమంది దానికి బానిసలు కూడా అయ్యారు.. కొంత మంది మైనర్లు సెల్ ఫోన్ లో శృంగార చిత్రాలు చూడటం మొదలు పెట్టారు.. ఇది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుందని భావించి నవంబర్ 11 న జరిగిన గ్రామ సభలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా తీర్మానాన్ని ఉల్లంఘిస్తే రూ. 200 జరిమానా విధిస్తున్నాం’ అని అన్నారు.