సాధారణంగా మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక అక్రమాలు జరుగుతుంటాయి. కానీ మనం వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తాం. ఇక అవినీతి, అక్రమాలు జరగవు అనుకున్న చోటే ఎక్కువ అవకతవకలు జరుగుతున్న సంఘటనలు మన దేశంలో చాలానే చూశాం. ప్రత్యేకించి ఆలయాల్లో ఎక్కువగా అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇలా ఓ ఆలయంలో జరిగిన అవినీతిని స్వయంగా వెళ్లి బయటపెట్టాడు సాక్షాత్తు హైకోర్టు జడ్జి. సామాన్య భక్తుడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లారు హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రహ్మణ్యం. ఆ దేవాలయంలో జరుగుతున్న అవినీతిని చూసి కంగుతిన్నారు ఆయన. దేవాలయంలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
జస్టిస్ సుబ్రహ్మణ్యం మద్రాస్ హైకోర్టులో జడ్జి. తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం చెన్నైలోని వడపళని దండాయుధపాణి దేవాలయానికి వెళ్లారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం వీఐపీ దర్శనం ఉన్నప్పటికీ.. సామాన్య భక్తుడిలా తన భార్య, కుతురితో కలిసి దర్శనానికి వెళ్లారు. రూ.50 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లను రూ.150 పెట్టి కొన్నారు. అయితే ఈ టికెట్స్ లో రెండు 50 రూపాయలవి ఇచ్చి, మరో టికెట్ మాత్రం 5 రూపాయలది ఇచ్చారు. ఇదేంటని జడ్జి ప్రశ్నించగా.. సిబ్బంది దాని స్థానంలో రూ.50 టికెట్ ను జారీ చేశారు. ఈ జిమ్మిక్కును జడ్జి కనిపెట్టారు.
అనంతరం ఈ విషయమై ఈవో రూమ్ కు వెళ్లగా అక్కడ ఆమె లేరు. దాంతో ఈవో ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి అక్కడ ఉన్న సిబ్బందిని కోరారు. దానికి సిబ్బంది నిరాకరించడమే కాకుండా జడ్జిపై అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించారు. ఇదంతా గమనించిన న్యాయమూర్తి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వారి సమక్షంలో సైతం ఈవో ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఆలయ సిబ్బంది నిరాకరించారు. దాంతో జడ్జి ఈవోపై కంప్లైంట్ నమోదు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి వెళ్లారు. ఇక మరుసటి రోజు కోర్టు కు హాజరు అయిన ఈవో.. కోర్టులో ప్రవర్తించిన తీరుపై జడ్జి సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు నోటీస్ బోర్డులో ఫోన్ నెంబర్లు ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్నించారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. దేశంలోని సీఎంలే నెంబర్ ఇవ్వడానికి వెనకాడనప్పుడు.. ఈవో నెంబర్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని జడ్జి భార్య ప్రశ్నించగా.. సీఎంలు నెంబర్ ఇస్తారేమో గానీ మేము ఇవ్వం అంటూ సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. ఇక స్థానిక పోలీసులు నన్ను గుర్తు పట్టకపోతే సాధారణ భక్తుడిని నెట్టివేసినట్లు నన్నుకూడా బయటకి నెట్టేవారేమో అని జడ్జి చెప్పుకొచ్చారు. సంవత్సరానికి రూ. 14 కోట్ల ఆదాయం, వందల కోట్ల ఆస్తులు కలిగిన ఈ దేవాలయంలోనే ఇలా ఉంటే.. మిగిలిన ఆలయాల్లో పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉందని జస్టిస్ సుబ్రహ్మాణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.