సాధారణంగా కృర మృగాలు అంటే ఎవరికైనా భయమే.. ఇటీవల పట్టణాలు, గ్రామాల్లోకి చిరుత, పెద్దపులి లాంటి కృర జంతువులు రావడం మనుషులపై దాడులు చేయడం చూస్తున్నాం. అడవులు అంతరించిపోతున్న క్రమంలో ఆకలి భాద తట్టుకోలేక గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
ఈ కాలంలో మనిషి తన ప్రాణానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణంగా చిరుత, పెద్దపులి, ఎలుగు బంటివి మనిషిని కృరంగా చంపి తింటాయి. అందుకే వాటి పరిసర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. అవి ఉన్నాయన్న వార్త తెలిసినా భయంతో వణికిపోతారు. చిరుత, పెద్దపులి సంచరిస్తుందని తెలిస్తే ప్రభుత్వ అధికారులు అటు వైపు వెళ్లకూడాదని ఆంక్షలు పెడతారు. అలాంటింది ఓ చిరుత ఆపదలో ఉందని తెలిసి తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఓ మహిళా వైద్యురాలు ఎంతో ధైర్యం చేసి చిరుతను కాపాడింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక.. మంగళూరు సమీపంలోని నిడ్డోడి గ్రామంలో ఓ బావిలో ప్రమాదవశాత్తు చిరుతపులి పడిపోయింది. ఏడాదిన్నర వయసు ఉన్న చిరుత అందులో పడిపోయిందని గ్రామస్థులు తెలుసుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. బావి వద్దకు అధికారులు చేరుకొని చిరుతను కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు.. కానీ అవి ఫలించలేదు. దీంతో పశు వైద్యులకు చిరుత బావిలో పడిందన్న సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న పశు వైద్య బృందం ఎంతో చాక చక్యంగా వ్యవహరించి చిరుతను కాపాడారు.
ఈ ఆపరేషన్ లో మేఘన అనే పశు వైద్యురాలి కీలక పాత్ర పోషించారు. మత్తుమందు ఇంజక్షన్ తో కూడినటువంటి గన్ చేత పట్టుకొని ఒంటిరిగా బోనులో కూర్చొని బావిలోకి దిగింది. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత మెల్లిగా చిరుతను బోనులోకి ఎక్కించింది. ఆ బోనును అటవీ అధికారులు, వైద్య బృందం కలిసి బయటకు తీసుకు వచ్చారు. స్పృహ వచ్చిన తర్వాత అటవీ శాఖ అధికారులు దాన్ని అడవిలోకి వదిలివేశారు. మొత్తానికి ప్రాణాపాయం నుంచి చిరుతను కాపాడగలిగారు.
కృర మృగం అందరూ భయపడిపోతుంటే.. అది ప్రాణాపాయస్థితిలో ఉందని తెలుసుకొని ఎంతో ధైర్యసాహసాలు చూపించిన మహిళా వైద్యురాలు మేఘన పై అటవీశాఖ అధికారులు, సహ వైద్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్న ఈ కాలంలో మేఘన లాంటి మహిళలు ఎంతో ధైర్యసాహసాలతో చిరుతను కాపాడిన విషయం గురించి తెలుసుకొని గ్రామస్థులు సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు.