నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలో నివాసాలకు గజం భూమి దొరకడం కష్టంగా మారింది. కొంచెం భూమి దొరికితే చాలు, అందులోనే అపార్ట్ మెంట్లు వెలుస్తున్నాయి. దీంతో శ్మశానాలకు స్థలం దొరకడం లేదు. పల్లెటూళ్లతో పోల్చుకుంటే పట్నంలో శ్మశాన వాటికల వెసులు బాటు ఉంటుంది. కానీ పల్లెటూళ్లలో పరిస్థితులు భిన్నం. ఊరి చివరిలో శ్మశనాలు ఉన్నప్పటికీ.. ఏదో సమస్యల్లో చిక్కుకుపోవడమే, లేక రెండు ఊళ్ల మధ్య తగాదాల్లో నలిగి పోతుండమో జరుగుతుంది. దీంతో అంత్య క్రియలు చేసేందుకు మృత దేహాలను కిలో మీటర్ల మేర మోసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యే ఓ గ్రామాన్ని పట్టి పీడిస్తుండగా..మొబైల్ శ్మశాన వాటిక రూపంలో పరిష్కారం దొరికినట్లయింది. ఆ ఊరేంటీ.. ఆ గ్రామ ప్రజలు ఏం చేశారంటే..?
కర్ణాటకలోని కుందాపూర్ లోని బైందూర్ జడ్కల్ గ్రామ పంచాయితీ ముదుర్ అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో 600 నివాసాలున్నాయి. గత ఏడాది ఆ గ్రామంలో షెడ్యూల్ కులానికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సమీపంలో శ్మశానం ఉన్నా, ఆ స్థలంపై వివాదంలో నలగటం, కోర్టు కేసు పెండింగ్ లో ఉండటంతో, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాపూర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అంత దూరం భారం తీసుకెళ్ల లేక..అతడి మృతదేహానికి కుటుంబ సభ్యులు ఇంటికి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో అది కాస్తా చర్చకు దారి తీసింది. దీంతో ఈ సమస్యకొక పరిష్కారం కనుగొనాలని అధికారులు భావించారు.
ఈ క్రమంలో కేరళలో మొబైల్ శ్మశాన వాటిక గురించి తెలుసుకున్న ముదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఎంపిఎసిఎస్) అధికారులు, ఒకటి కొనుగోలు చేసి గ్రామానికి ఇవ్వాలని భావించారు. కేరళలోని స్టార్ చైర్ కంపెనీ వీటిని తయారు చేస్తోంది. దీంతో ఆ సంస్థను సంప్రదించి.. రూ. 5.8 లక్షలు వెచ్చించి ఆ మొబైల్ శ్మశాన వాటికను ఆ గ్రామానికి తరలించారు. ఇందులో 10 కిలోల ఎల్జీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దీని సాయంతో రెండు గంటల్లోనే మృతదేహం పూర్తిగా దహనం అయిపోతుంది. అభ్యర్థన మేరకు ఆ వాహనాన్ని తరలించుకునే సదుపాయం ఉంది. ఈ సేవ కోసం సొసైటీ.. వ్యక్తుల నుండి ఎలాంటి నగదును వసూలు చేయలేదని ఎంపిఎసిఎస్ అధికారులు చెబుతున్నారు.