చలికాలం అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. వాతావరణం చల్లగా ఉండటంతో బయటకు అడుగు వేయలేం. ఉదయం చలికి లేవాలన్నా బద్దకం.. అందుకే చాలా మంది రగ్గులు కప్పుకొని పడుకుంటారు. కానీ చలిలో నీళ్లు కూడా గడ్డ కట్టే టెంపరేచర్ లో దేశ సైనికులు మన దేశం కోసం పోరాడుతూనే ఉంటారు. అంతే కాదు ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటారు. ఓ నిండు గర్భిణిని చిలిలో 14 కిలో మీటర్లు మోసుకుంటూ ఆస్పత్రికి తరలించారు సైనికులు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని హర్గం అనే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జమ్ము-కాశ్మీర్ లోని హర్గం అనే గ్రామంలో సర్పంచ్ నుంచి ఆర్మీకి ఒక ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది. ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా ఆమె పరిస్థితి ఎంతో విషమంగా ఉందని ఆర్మీ ఆఫీసర్ కి సమాచారం ఇచ్చారు. మంచుతో అక్కడి రోడ్లు అస్తవ్యస్తంగా ఉంది. రంగంలోకి దిగిన జవాన్లు గడ్డ కట్టిన మంచులో ఆరు గంటల పాటు శ్రమించి గర్బిణి ని 14 కిలో మీటర్లు స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. మనిషి నడవడానికి కష్టమైన ఆ దారిలో జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి ఆ మహిళను అంగారీ అనే గ్రామానికి తరలించారు. అప్పటికే అక్కడ మరో ఆర్మీ బృందం అంబులెన్స్ తో సిద్దంగా ఉంచింది.
గర్బిణిని సురక్షితంగా బనిలాల్ లో ఉన్న ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. దేశ రక్షణ మాత్రమే కాదు ఆపదలో ఉన్నవారిని తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రక్షిస్తామని మరోసాచి తమ గొప్ప మనసు చాటుకున్నారు. జవాన్లు చేసిన పనికి గర్భిణి బంధువులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. నెటిజన్లు జవాన్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ లో ఫోపియాస్ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.