కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు. ఎవరు అధికారంలో వస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే ముూడ్ ఆఫ్ ది నేషన్‌లో ఆసక్తి కల్గించే అంశాలు వెలుగుచూశాయి. అవేంటో తెలుసుకుందాం.
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. జమిలి ఎన్నికలు రాకుంటే మాత్రం తిరిగి 2029లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఒకవేళ దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలో వస్తారనే విషయంపై ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంశాలు సంచలనంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో అంటే 2024లో ఎన్డీయేకు 293 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో 54,788 శాంపిల్స్ సేకరించి అభిప్రాయాల్ని క్రోడీకరించారు. అదే గత 24 వారాల్లో అయితే 2 లక్షల మంది అభిప్రాయాలు సేకరించారు.
దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే..
ఎన్డీయేకు 324 స్థానాలు
బీజేపీకు 260 స్థానాలు
ఇండియా కూటమికి 208 స్థానాలు
ఎన్డీయే ఓటు శాతం 46.7 శాతం
ఇండియా కూటమి ఓటు శాతం 40.9 శాతం
ప్రధానిగా నరేంద్ర మోదీకు 51.5 శాతం
రాహుల్ గాంధీకు 24.7 శాతం
బీజేపీ ఓటు శాతం 40.6
కాంగ్రెస్ ఓటు శాతం 20.8
2024 ఎన్నికల్లో…
ఎన్డీయే కూటమికి 293 స్థానాలు
ఇండియా కూటమికి 234 స్థానాలు
బీజేపీకు 240 స్థానాలు
కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు
ఇదే సంస్థ 2025 ఫిబ్రవరిలో ఇదే సర్వే చేపట్టినప్పుడు బీజేపీకు 281 స్థానాలు, ఎన్డీయే కూటమికి 343 స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది. ఆరు నెలల తరువాత చేపట్టిన సర్వేలో కూటమికి 324 సీట్లు, బీజేపీకు 260 సీట్లు వస్తాయని తెలిపింది. అంటే ఆరు నెలల వ్యవధిలో 20కు పైగా సీట్లు తగ్గిపోయాయి. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకు 78 సీట్లు వస్తాయని చెప్పిన ఈ సర్వే ఇప్పుడు 97 సీట్లు సాధిస్తుందని పేర్కొంది.