పెళ్లికి మందు మతిమరుపు ఎంత ఉన్నా పర్వాలేదు. కానీ.. పెళ్లి తరువాత మాత్రం అలా ఉంటే కుదరదు. భార్య పుట్టిన రోజు, పెళ్లి రోజులను తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేదంటే భాగస్వామి పెట్టే టార్చర్ ను భరించాల్సిందే. తాజాగా ఓ భార్య తన భర్త పెళ్లి రోజు మర్చిపోయాడని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అందుకే చాలా మంది పెళ్లి రోజును ఘనంగా జరుపుకుంటారు. అలానే పెళ్లి రోజును దాదాపు అందరూ గుర్తు పెట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం వారి వ్యక్తిగత సమస్యల వలన మర్చిపోతుంటారు. ముఖ్యంగా భర్తలు పెళ్లి రోజును మరచిపోతారు. ఈ క్రమంలో భర్తలపై అలిగిన భార్యలు మాట్లాడకుండా ఉంటారు. అయితే పెళ్లి రోజు మరిచిపోయాడని భర్తపై దాడి చేసిన భార్యలు ఎక్కడైనా కనిపిస్తారా?. అలాంటి ప్రశ్నకు నేనున్నాను అని ఓ మహిళ వార్తల్లోకి ఎక్కింది. పెళ్లి రోజు మరిచిపోయాడని భర్తపై చెప్పుతో కొట్టి దాడికి పాల్పడింది. అంతటితో ఆగక అత్తింటివారిపై దండయాత్ర చేసింది. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర లోని ముంబై నగర సమీపంలో ఉన్న ఫట్ కోపర్ అనే ప్రాంతంలో విశాల్ నాంగ్రే , కల్పన అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి 2018లో వివాహం జరిగింది. విశాల్, కల్పన ఇద్దరూ ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఏటా వీరి పెళ్లి రోజు చాలా చక్కగా జరుపుకుంటారు. అయితే తాజాగా వీరి పెళ్లి రోజును విశాల్ మర్చిపోయాడు. దీంతో కల్పన ఈరోజు ప్రత్యేక ఏంటో తెలుసా? అంటూ విశాల్ ను ప్రశ్నించింది. అయితే తనకు మతిమరపు ప్రభావమో లేదా మరేదైనా కారణం కావచ్చు.. విషయం గుర్తుకు రాలేదు. మరోసారి కూడా కల్పన.. విశాల్ ను అదే ప్రశ్న అడిగింది.
ఎంత ఆలోచించిన విశాల్ కు ఆ రోజు ప్రత్యేకత ఏంటనేది గుర్తుకు రాలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన కల్పన భర్తతో గొడవకు దిగింది. చిన్నగా మొదలైన గొడవ కాస్తా పెద్దగా మారింది. ఈక్రమంలో భర్తను చెప్పుతో కొట్టింది. అడ్డొచ్చిన అత్తను కూడా చెప్పుతో కొట్టి దాడి చేసింది. అంతటితో ఆగని కల్పన పుట్టింటి వారికి ఫోన్ చేసి పిలిపించింది. వారితో అత్తింటి వారిపై దాడి చేసింది. దీంతో గాయపడిన భర్త స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కల్పనతో సహా ఆమె కుటుంబపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యాలు చేపట్టారు. అయితే ఈ వార్త తెలిసిన వారు.. “ఏంటి అక్క ఈ ఆరాచకం.. పెళ్లి రోజు గుర్తులేకుంటేనే దాడి చేస్తావా?” అంటూ కామెంట్స్ చేశారు. ఇది కేవలం పెళ్లి రోజు మరచిపోయినందుకు చేసిన దాడి కాదని, ఆ మహిళ మనస్సులో మరేదో ఉన్నట్లు కొందరు అభిప్రాయాపడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.