దీపావళి సందర్బంగా కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ లు ఇస్తుంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే.. ఉద్యోగులకు అదిరిపోయే బహుమతులు ఇస్తుంటాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం దీపావళి సందర్భంగా ప్రజలకు కొన్ని శుభవార్తలు చెబుతుంటాయి. రుణ మాఫీ, కరెంట్ బిల్లు తగ్గించటం, పలు రకాల ఆదాయలపై పన్నులు తగ్గిచండం చేస్తుంటాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రకటిచింది. వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ రాష్ట్రంలోని ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు ఏడాదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్లుగా ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలోని 38లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి వఘాని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని మహిళలకు రూ.1000 కోట్లు లబ్ది జరగనుంది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు సీఎన్జీ, పీఎన్ జీ గ్యాస్లపై 10 శాతం వ్యాట్ ను తగ్గించున్నట్లు భాజపా సర్కారు వెల్లడించింది. దీని వల్ల ఒక కేజీ సీఎన్‌జీపై ఆరు నుంచి ఏడు రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా పీఎన్‌జీ గ్యాస్‌పైన కూడా ఐదు రూపాయల నుంచి 6 రూపాయల వరకు తగ్గనుంది.
రాష్ట్ర ప్రజలకు దీపావళి సందర్బంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలు ఇవేనని సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన లబ్ధి దారులకు మాత్రమే ఈ కొత్త పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి వఘాని తెలిపారు. అదే విధంగా సిలిండర్లకు సంబంధించిన రిఫండ్ అమౌంట్ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుందని మంత్రి వివరించారు. బీజేపీ సర్కారు ప్రకటించిన దీపావళి కానుకలపైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇదే కేవలం రాజకీయ లబ్ధి కేసమేనని విమర్శలు చేస్తున్నాయి. త్వరలో గుజరాత్ ఎన్నికలు ఉన్నందున ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.