సామాన్యులకు నిత్యవసర సరుకైన వంటనూనె ధరలు లాక్ డౌన్ సమయంలో చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఆయిల్ ధరలు చూసి జనాలు భయపడిపోయారు. కానీ ఇటీవలే మళ్లీ దేశంలో ఆయిల్ ధరలు కాస్త ఊరటనివ్వడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దేశంలో వంటనూనెల ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ఇటీవల ఆయిల్ ధరలు తగ్గడంతో దేశంలో వాడకం పెరిగింది. కానీ నూనె పంటలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. ఇండియాకి ఇండోనేషియా నుండి ఎక్కువగా వంటనూనెలు దిగుమతి అవుతున్నాయి. అయితే.. భవిష్యత్ లో ఇండోనేషియా ఆయిల్ ఎగుమతులు తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉందట.
ఈ కారణంగా దేశానికి వంటనూనె దిగుమతుల పై ప్రతికూల ప్రభావం పడనుందని.. కాబట్టి ధరలు పెరగనున్నాయని సమాచారం. ఇండియా దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ 60% ఇండోనేషియా నుండే వస్తుందట. ఒకవేళ ఇండోనేషియా నుండి దిగుమతులు రాకపోయినా వేరే దేశాల నుండి దిగుమతులు చేసుకోవాలని ఇండియన్ ఇడిబుల్ ఆయిల్ పరిశ్రమ భావిస్తోంది.
ఇందులో భాగంగా మలేషియా నుండి ఆయిల్ దిగుమతులను పెంచుకోవాలని చూస్తుందట. కానీ మలేషియా నుండి దిగుమతి చేసుకోవడం కష్టమైన పని అని ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తున్నాయి. దీంతో త్వరలోనే ఇండియాలో వంటనూనె ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి. అంటే మరోసారి సామాన్యులపై ఆయిల్ ధరల భారం పడనుందని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ఈ ఆయిల్ ధరల విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.