దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మార్చితో గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు పాలనా కాలం ముగియనుండగా, మే నెలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల పాలనా కాలం ముగియనున్నది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ భవన్ లో శనివారం నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్టు సీఈసీ తెలియజేసింది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికలు జరగబోనే 5 రాష్ట్రాల్లో 2,15,368 పోలీంగ్ కేంద్రాలు ఉన్నాయని, 24.5 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలియజేసింది. జనవరి 15, 2022 వరకు ఎటువంటి భౌతిక రాజకీయ ర్యాలీలు , రోడ్‌షోలు అనుమతించబడవని.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను తగ్గించినట్టు సీఈసీ తెలియజేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు సీఈసీ తెలియజేసింది.
ఇది చదవండి : పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యం అంశంపై చంద్రబాబు ఓపెన్ కామెంట్స్
ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే కూడా పాల్గొన్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకున్నామని సీఈసీ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఈసీ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. కరోనా తీవ్రత కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించినట్లుగా తెలిపారు. కొవిడ్ రహిత పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఓటర్లతో పాటు సిబ్బందిని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది అని చెప్పారు.