మైనర్లను పలు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం గురించి వింటూనే ఉన్నాం. అదే విధంగా కొన్ని కేసుల్లో పెంపుడు జంతువుల్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా విన్నాం. కానీ తొలిసారి ఒక కేసులో ఓ రామచిలుకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు చిలుకను అరెస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. అవును, ఇది ముమ్మాటికీ నిజం. అయితే ఇందులో రామచిలుక చేసిన నేరం ఏమీ లేదు. తప్పంతా దాని యజమానిదే. నేరం చేసిన యజమాని పారిపోతే అతడి ఆచూకీ చెబుతుందేమోనని చిలుకను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చిలుకను అరెస్ట్ చేసి బంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులు తమ తెలివితేటలు వాడకుండా.. ఇలా ఓ చిలుక మీద ఆధారపడటం హాట్ టాపిక్‌గా మారింది.
బిహార్ గయాలోని గురువా స్టేషన్ పరిధిలోని ఒక మారుమూల గ్రామంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్‌పెక్టర్ కన్హయ్య కుమార్ తన టీమ్‌ను వెంటబెట్టుకుని నేరస్తుడ్ని పట్టుకునేందుకు బయల్దేరారు. నేరస్తుడి ఇంటిపై కన్హయ్య కుమార్ రైడ్ చేశారు. అయితే పోలీసులు వచ్చిన సంగతిని గమనించిన చిలుక తన పలుకులతో యజమానికి సిగ్నల్ ఇచ్చింది. దీంతో అక్రమంగా మద్యం అమ్ముతున్న అమృత్ మల్లా అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలసి అక్కడి నుంచి పారిపోయాడు. తాము రహస్యంగా అక్కడికి వెళ్లినా నేరస్తుడు ఎలా తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తుండగా.. ఇంటి వరండాలో ఉన్న రామచిలుక అరవడం కనిపించింది. దీంతో అదే వాళ్లకు సంకేతాలు ఇచ్చి తప్పించుకునేందుకు సాయపడిందని భావించారు. ఆ చిలుకను వెంటనే బోనులో బందించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. యజమాని ఆచూకీ చెబుతుందేమోనని స్టేషన్‌కు తీసుకొచ్చినప్పటికీ.. అది మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు.