సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల వద్దకు వచ్చి ఎన్నో హామీలు ఇస్తుంటారు. తమ ప్రభుత్వం పాలనలోకి వస్తే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. గెలిచిన తర్వాత కొంతమంది నేతలు ప్రజలకు ముఖం చాటేస్తుంటారు. కానీ కొంత మంది నేతలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ ఉంటారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ఓ మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పడమే కాదు.. ఓ వ్యక్తి పాదాలను కూడా కడిగారు. ఈ ఘటన మద్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడి రోడ్ల పరిస్థితి చూసి షాక్ అయ్యారు.. అక్కడ మురుగు నీటి పైప్ లైన్ కోసం రోడ్డుని తవ్వి అలాగే వదిలి వేశారు. దాంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగడం పై క్షమాపణలు చెప్పారు. అంతేకాదు సామాన్యుడి పాదాలు కడిగాడు. మురుగు నీటి లైన్ కోసం తవ్విన రహదారిని వెంటనే బాగు చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి.
ఇటీవల రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో రోడ్ల మరమ్మత్తు జరిగే వరకు తాను చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేశారు మంత్రి ప్రధుమన్ సింగ్. ఆయన నిరసన తో ఇటీవల రోడ్ల మరమ్మతులు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మంత్రి చెప్పులు లేకుండా తిరగడం గురించి తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంత్రి ప్రధుమన్ సింగ్ కి కొత్త చెప్పులు అందించారు. త్వరలో రోడ్ల నిర్మాణం చేస్తామని.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.