నేటికాలంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మగవారికి ధీటుగా ప్రతి రంగంలోనూ తమ ప్రతిభతో అభివృద్ధి పథం వైపు సాగుతున్నారు. గ్రామ ప్రథమ పౌరురాలి స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగారు నేటితరం మహిళలు. ఇంతలా ప్రగతి పథంలో మహిళలు ఎంతగానో దూసుకెళ్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వెనుబడే ఉన్నారు. అంతేకాక పూర్వం జరిగినట్లు ఇప్పటికి చాలా ప్రాంతాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాల కారణంగా మాతాశిశుమరణాలు బాగా సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కీలక చట్టాలు చేశాయి. అయినా కూడా నేటికి అక్కడక్కడ బాల్య వివాహలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అస్సాం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు బాలికలను పెళ్లాడితే యావజ్జీవ శిక్ష విధించనున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సోమవారం అస్సాం ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అధ్యక్షతను ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హజరై.. పలు అంశాలపై తమ సలహాలు సూచలను చేశారు. అలానే వివిధ అంశాలకు ఈ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ మీటింగ్ అనంతరం ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే కేబినెట్ లో చర్చించిన పలు అంశాలను మీడియా ముందు వెల్లడించారు. అస్సాంలో 14 ఏళ్ల లోపు వయస్సున్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ శిక్ష విధించనున్నట్లు ఆయన తెలిపారు. అస్సాంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ మరణాలకు బాల్య వివాహాలే ప్రధాన కారణమని సీఎం అన్నారు. వచ్చే అయిదేళ్లలో బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి చర్యలు చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. తాజాగా అస్సాం కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఎవరైన 14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. జీవిత ఖైదీ శిక్ష విధించనున్నారు.
ఒక వేళ 14 ఏళ్ల లోపు బాలికను అదే వయసు ఉన్న బాలురు వివాహం చేసుకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయని ఓ విలేకరి ప్రశ్నించాడు. ఒకవేళ అలాంటి వివాహాలు జరిగితే .. వాటిని చట్ట విరుద్దంగా ప్రకటించి, బాలురను జువైనల్ హోంకు తరలిస్తామని సీఎం చెప్పారు. అదే విధంగా 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్న వారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద శిక్షించనున్నట్లు హిమంత బిశ్వశర్మ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని తీసుకున్నది మాత్రం కాదని, దీనికి రాజకీయ రంగు ఆపాద్దించవద్దని హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. మరి.. బాల్య వివాహాల విషయంలో అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.