ఆ గ్రామంలోని మహిళలు ఓ కీలక నిర్ణయానికి కట్టుబడి మంచి పనికి పూనుకున్నారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అంగీకార పత్రాలపై సంతకాలు చేయనున్నారు.
ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అది మనం తినే ఫుడ్ ఎఫెక్ట్ కావచ్చు.. నియమాలు పాటించని ఆహారపు అలవాట్లు కావచ్చు మనల్ని అనారోగ్యానికి దరి చేర్చుతున్నాయి. నేడు పిల్లలు,పెద్దలు, యువకులు అని తేడా లేకుండా అనేక జబ్బులు వస్తున్నాయి. వాటి బారిన పడిన తర్వాత జీవితాన్ని నిలదొక్కుకోవడం భారమవుతోంది. రోగాలు నయం చేసుకోలేక మద్యంతరంగానే కొందరు తనువు చాలిస్తున్నారు. వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. కొంతమంది ఆర్గాన్స్ డొనేషన్ చేసి కొంతమందినైనా కాపడే ప్రయత్నిస్తున్నారు. అన్ని దానాల్లోకెల్ల అవయవ దానం గొప్పది. మనం చనిపోయినా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి జీవితాన్నిస్తాయి. ఇలా అవగాహన ఉన్నవాళ్లు వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తారు. వారికి సెల్యూట్ చేయాలి. అలాంటిదే కేరళలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 5వేల మంది మహిళలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున అవయవదానం అంగీకార పత్రాలపై సంతకం చేయడానికి నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళితే..
కేరళ కోజికోడ్‌లోని కొట్టూర్ గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు తాము చనిపోయిన తర్వాత కూడా అవయవాలు ఇతరులకు ఉపయోగపడేలా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 5 వేల మంది ఒకేసారి అవయందానికి అంగీకారం తెలిపారు. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారులకు అంగీకార పత్రాలు సమర్పించనున్నట్లు మహిళలు తెలిపారు. కాగా కొట్టూర్ గ్రామం కుటుంబశ్రీ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మహిళా సాధికారత కోసం, పేదరిక నిర్మూలనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సంస్థ కుటుంబశ్రీ. ఈ సంస్థ యందు 20 మంది గ్రూపుతో ఒక్కో యూనిట్ ఏర్పాటుచేయబడింది. కొట్టూర్ గ్రామంలో అన్ని వార్డుల్లో అవయవదానంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు అవయవ దానం చేసి.. సంపూర్ణ అవయవదాన పంచాయతీగా మార్చలని యోచిస్తున్నారు. సీడీఎస్ చైర్ పర్సన్ షీనా యూఎం, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సీహెచ్ సురేశ్, కో ఆర్డినేటర్ సీకే వినోదన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు. కుటుంబశ్రీ 25వ వార్షికోత్సవం సందర్భంగా, 19 వార్డుల్లో జూన్ 25 నుంచి జులై 5 వరకు ప్రచారం విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. కుటుంబశ్రీ సంస్థ సభ్యులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో మహిళలే కాకుండా పురుషులు కూడా కార్యక్రమాల్లో ముందడుగు వేస్తున్నారు.