టాలీవుడ్ అగ్రనట్లుల్లో ఒకరైన బాలకృష్ణ పేరు తెలియని ఇండస్ట్రీ లేదు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అందరికీ సుపరిచితమైన నటుడు. ఆయన తెరమీద కనిపిస్తే చాలు జై బాలయ్య నినాదాలే. సినిమా చేసినా, షో చేసినా రికార్డులే. ఇప్పుడు బాలకృష్ణ మరో ప్రయాణం దిశగా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. తండ్రి నుండి నటనను వారసత్వంగా తీసుకున్నప్పటికీ తనదైన యాక్టింగ్, మ్యానరిజమ్‌తో ఆకట్టుకుని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన వెండి తెరపై ఏం చేసినా క్రేజే. అమాయకత్వం, డ్యాన్సింగ్, డైలాగ్ డెలివరీలో కొట్టిన పిండి. అభిమాన గణం కూడా చాలా ఎక్కువే. బాలయ్య అనే పిలుపుతో చిన్న పిల్లలకు చేరువయ్యారు. 100కు పైగా సినిమాలు చేసిన ఈ నట సింహం.. అన్ స్టాపబుల్ అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చి మెప్పించారు. తొలి షోతోనే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. దీంతో బాలయ్యపై ఏ మూలో ఉన్న నెగిటివిటీ కూడా వీగిపోయి.. అందరి బాలయ్యగా మారిపోయారు.
ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షోలో తొలిసారిగా హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు బాలకృష్ణ. అనేక మంది నటీనటులను తీసుకువచ్చి తనదైన స్టైల్ లో ఇంటరాగేషన్‌తో కూడిన ఇంటర్వ్యూ చేశారు. బాలకృష్ణ తప్ప ఈ షో మరెవ్వరూ చేయలేరేమోనన్నంత పాప్‌లర్ అయ్యింది. మరే ఇతర షోలకు దక్కని ఆదరణ ఈ షోకు దక్కింది. టీఆర్పీ రేటింగ్‌లో కూడా దూసుకుపోయింది. ఇప్పటికే ఈ షో రెండూ సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక బాలయ్య అటు రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. సంక్రాంతికి వచ్చిన వీర సింహా రెడ్డి సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా పలు థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంది. కాగా, బాలయ్య అనిల్ రావుపూడి దర్శకత్వంలో 108వ సినిమాను చేయబోతున్నారని సమాచారం.
అయితే ఓటీటీలో అన్ స్టాపబుల్ తో సక్సెస్ కావడంతో ఈ టాక్ షో నిర్మాత అల్లు అరవింద్ బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై బాలకృష్ణతో చర్చలు జరుపుతున్నారట. అరవింద్ ప్రయత్నాలు సఫలీకృతమైతే .. బాలకృష్ణను కూడా ఇక వెబ్ సిరీస్ లో చూడవచ్చు. ఇటీవల కాలంలో ప్రముఖ తారలంతా ఓటీటీ బాట పడుతున్న సంగతి విదితమే. వెంకటేష్, రానా ‘రానా నాయుడు’గా సందడి చేయబోతున్నారు. అటు సమంత వంటి స్టార్ నటి కూడా గతంలో ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ చేయగా, ఇప్పుడు మరో వెబ్ సిరీస్ సీటాడెల్‌తో రాబోతున్నారు. అంజలి ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు చేసింది. విజయ్ సేతుపతి, లావణ్య త్రిపాఠి ఇప్పటికే ఓటీటీలో మెరిశారు. నటుడు నాగ చైతన్య కూడా ఓ సిరీస్‌లోరాబోతున్నారు. ఇక బాలయ్య కూడా వస్తే ఓటీటీలో దబిడిదిబిడే.