కాబూల్- అఫ్గనిస్థాన్ ను అమెరికా పూర్తిగా తమ సైన్నాన్ని ఉపసంహరించుకుంది. ఈమేరకు అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం తరలింపు సోమవారం అర్ధరాత్రితో పూర్తయ్యింది. దీంతో 20 సంవత్సరాల అఫ్గాన్ లో అమెరికా ప్రస్థానానికి తెరపడింది. భారీ సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గన్ పుననిర్మాణానికి అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చుచేసినా.. అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
ఇస్లామిక్ తాలిబన్ల అధికారంలో ఉన్నప్పుడు అఫ్గనిస్తాన్ లోకి ప్రవేశించిన అమెరికా, తిరిగి ఇప్పుడు వారి పాలనతోనే వెనక్కి వెళ్లిపోవడం కాకతాళీయం అని చెప్పవచ్చు. అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో మంగళవారం తెల్లవారుజామున కాబూల్‌లో తాలిబన్లు వేడుకలు చేసుకున్నారు. అమెరికా నేతృత్వంలోని యుద్ధానికి సహకరించిన పదివేల మంది అమెరికన్లు, అఫ్గన్‌ల తరలింపు ప్రక్రియ ఆఖరి రోజుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది.
కాబూల్ విమానాశ్రయం వద్ద గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా అఫ్గన్ పౌరులు మొత్తం 160 మందికిపైగా చనిపోయారు. తమ సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియలో జాప్యం జరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అమెరికా భావించింది. అందుకే ఓ వైపు బాంబు దాడులు జరుగుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా అనుకున్న గడువులోగా తరలింపు ప్రక్రియను పూర్తిచేసింది.
అఫ్గనిస్తాన్ లో 20 సంవత్సరాలు యుద్ధం ముగిసిందని, ఆగస్టు 31లోగా సైన్యం ఉపసంహరణ పూర్తిచేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ యుద్ధంలో 2,400 మందికిపైగా అమెరికా సైనికులు చనిపోయారు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌లో సైన్యం ఆపరేషన్, అమెరికా పౌరుల తరలింపు పూర్తయినట్టు అమెరికా జనరల్ కెన్నెత్ మెకెంజీ ప్రకటించారు.