కేరళలో హఠాత్తుగా ఆకాశం ఊడి పడిందా అన్నట్టు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీ విధ్వంసం జరిగింది. పెద్ద పెద్ద చెట్లు, కరెంట్ స్తంభాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇదంతా ఏదో పెద్ద తుఫాను వల్ల జరిగింది అనుకుంటే పొరపాటే! దీనంతంటీకి కారణం ‘మైక్రో బరస్ట్’. అసలు ఈ మైక్రో బరస్ట్ అంటే ఏంటి? కేరళలో ఇది ఎందుకు సంభవించిందో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా తుఫాను వస్తే గాలులు గుండ్రంగా తిరుగుతాయి. కానీ, మైక్రో బరస్ట్‌లో గాలి ఆకాశం నుండి నేరుగా, అత్యంత వేగంగా భూమి వైపు నిలువుగా దూసుకొస్తుంది. ఒక బకెట్ నీటిని ఒక్కసారిగా బోర్లిస్తే నీరు ఎలా కింద పడి నలుదిక్కులా విస్తరిస్తుందో… మైక్రో బరస్ట్ కూడా అలాగే పనిచేస్తుంది. తీవ్రమైన ఉరుములు, మెరుపుల తుఫాను సమయంలో.. మేఘాల నుండి చల్లటి గాలి స్తంభంలా గంటకు 150 నుండి 160 కిలోమీటర్ల వేగంతో భూమిని తాకుతుంది. ఇది 4 కిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో, కేవలం 5 నుండి 15 నిమిషాల పాటు మాత్రమే జరుగుతుంది. కానీ, ఆ కొంతపేపటికే టోర్నడో స్థాయి విధ్వంసాన్ని సృష్టిస్తుంది.” “అయితే, కేరళలోనే ఇవి ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? దీనికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నయంటున్నారు వాతావరణ నిపుణులు.
కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు, సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు కలిసి ఆకాశంలో భారీ క్యుములోనింబస్ మేఘాలను ఏర్పరుస్తాయి. ఈ భారీ మేఘాల మధ్యలోకి పొడి గాలి ప్రవేశించినప్పుడు, మేఘాల్లోని నీటి బిందువులు ఆవిరైపోతాయి. దీనివల్ల మేఘం లోపల గాలి ఒక్కసారిగా చల్లబడి, బాగా బరువెక్కుతుంది.దీంతో మేఘం పైభాగంలో టన్నుల కొద్దీ నీరు, వడగళ్ళు పేరుకుపోతాయి. ఒక దశలో మేఘం ఆ బరువును మోయలేక పూర్తిగా బలహీనపడుతుంది. ఎప్పుడైతే మేఘం బరువును మోయలేదో, గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ చల్లటి గాలి, నీరు అంతా కలిసి ఒక్కసారిగా కిందకు కుప్పకూలిపోతాయి. దీనినే ‘మైక్రో బరస్ట్’గా పిలుస్తారు. సరిగ్గా కేరళలో ఇప్పుడు అదే జరిగింది. అందుకే ఆ గాలుల దాటికి పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకూలాయి. దీని వల్ల సంభవించే గాలులు..చాలా బలంగా వీస్తాయి. అడ్డుగా వచ్చే దేనినైనా నేలమట్టం చేసేంతాగా ఈ మైక్రో బరస్ట్ బీభత్సం సృష్టిస్తుంది.
“వాతావరణ మార్పుల వల్ల అరేబియా సముద్రం వేడెక్కడం, పశ్చిమ కనుమల భౌగోళిక నిర్మాణం కారణంగా కేరళలో ఇలాంటి అరుదైన ఘటనలు ఇటీవల తరచూ కనిపిస్తుంటాయి. ఈ మైక్రో బరస్ట్‌లు ఎంత ప్రమాదకరమంటే.. ఇవి వచ్చేటప్పుడు విమానాలు ల్యాండింగ్ లేదా టేకాఫ్ అవుతుంటే, ఆ గాలి ఒత్తిడికి విమానాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఏవియేషన్ రంగంలో దీనిని అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు.” ఈ మైక్రో బరస్ట్‌లను ముందే ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి చాలా చిన్న పరిధిలో, అతి తక్కువ సమయంలో జరిగిపోతాయి. అధునాతన డాప్లర్ రాడార్ల ద్వారా మాత్రమే వీటిని కొంతవరకు గుర్తించగలరు. ప్రకృతి మారుతున్న తీరుకు, వాతావరణ మార్పులకు ఇవి స్పష్టమైన సంకేతాలు
