బెంగళూరు- భారత సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల మాఫియా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఆ మధ్య తెలుగు సినీ పరిశ్రమలోను పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగింది. పలువురు సినీ సెలబ్రెటీలను తెలంగాణ పోలీసులు విచారించారు కూడా. ఇక ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వివాదం ముదురుతోంది.
శాండల్‌వుడ్ లో మాదకద్రవ్యాల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కన్న సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు నిందితులైన కన్నడ హీరోయిన్లు సంజనా, రాగిణి ద్వివేది చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ లెబొరెటరీ రిపోర్ట్ నివేదిక ఇచ్చింది. సంజనా, రాగిణి ద్వివేది నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరీక్షించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కాలేదు.
దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వారి వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షలు చేసింది. ఈ పరీక్షలో సంజనా, రాగిణి ద్వివేది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఈ హీరోయిన్ లు ఇద్దరికి పోలీసుల నుంచి మరోసారి సమన్లు అందనున్నాయి. ఈ డ్రగ్స్ కేసులో సంజనా, రాగిణి ద్వివేది ముందు పోలీస్ స్టేషన్ మెట్లు, ఆ తరువాత జైలుకు వెళ్లాల్సిందేనని శాండల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.
ఐతే ఇప్పటికీ డ్రగ్స్ కేసుతో తమకేం సంబంధం లేదని సంజనా, రాగిణి ద్వివేదిలు చెప్పడం విశేషం. ఇక ఈ కేసులో కన్నడ సినీ పరిశ్రమకు చెందినవారితో పాటు మరి కొంత మంది రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారందరికి కూడా పోలీసులు సమన్లు జారీ చేయనున్నారని సమాచారం.