చిత్తూరు- అమర జవాన్ లాన్స్‌నాయక్ సాయుతేజకు కన్నీటి వీడుకోలు పలికారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన 13 మందిలో లాన్స్‌నాయక్ సాయుతేజ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సాయితేజ పార్ధివదేహానికి ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదం జరగ్గా, నాలుగు రోజుల తరువాత ఆదివారం మధ్యాహ్నం భౌతికకాయం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చేరుకుంది.
బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో సాయితేజ పార్ధివదేహం తీసుకురాగా, 30 మంది సైనికులు మూడు ట్రక్కుల్లో సాయితేజ స్వగ్రామానికి చేరుకున్నారు. ఆర్మీ అధికారులు వందన సమర్పణ చేయగా, సైన్యం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించింది. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్ కుమార్, వెంకటప్పల నాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు హాజరై నివాళి అర్పించారు.
సాయితేజ పార్ధివదేహాన్ని చూసేందుకు ప్రజలు క్యూ కట్టారు. మదనపల్లె నుంచి ఎగువరేగడ వరకూ సుమారు 20 కిలో మీటర్ల మేర ఎన్‌సీసీ కేడెట్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజాసంఘాలు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని అడుగడుగునా నీరాజనం పలికారు. జై జవాన్, భరతమాత ముద్దుబిడ్డ సాయితేజ అమర్ రహే.. అంటూ జాతీయ జెండాలతో పెద్దఎత్తున నినాదాలు చేశారు.
సాయితేజ అంతియాత్ర సందర్బంగా ప్రజలు రోడ్డు వెంబడి పూల వర్షం కురిపించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మానవహారం తరహాలో రోడ్డు వెంట జనహారతి పట్టారు. ఇక మదనపల్లె పట్టణంలోకి ప్రవేశ మార్గమైన బసినికొండ బోర్డు నుంచి యువత స్కూటర్లపై భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలో 2కిలో మీటర్ల దూరాన్ని దాటడానికి గంటన్నర సమయం పట్టింది. ర్యాలీ సాగినంత సేపు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.
ఎగువరేగడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన మైదానంలో ప్రజల సందర్శనార్థం సాయితేజ భౌతికకాయాన్ని గంటన్నర పాటు ఉంచారు. అంబులెన్స్ గ్రామానికి చేరుకోగానే కుటుంబ సబ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సాయుతేజ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక భార్య, పిల్లల ఆవేదన అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, భార్య శ్యామల, పిల్లలు, తమ్ముడు మహేష్ బాబు నివాళి అర్పించారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేయడంతో ప్రజలు కాలినడకన అంత్యక్రియలకు హాజరయ్యారు.